Telangana: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు.. పొంగిపొర్లుతున్న వాగులు..
మంగళవారం రాత్రి నుంచి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. మూల వాగు, మొయదుమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. లోయర్ మానేరు డ్యామ్ లోకి భారీగా వరద నీరు వస్తోంది. దీంతో ఎల్ఎండీ నిండిపోయింది. మోయదుమ్మ వాగు ద్వారా 40 వేల క్యూసెక్కుల వరద వస్తోంది.
కాసేపట్లో అధికారులు లోయర్ మానేరు డ్యాం గేట్లు ఎత్తే అవకాశం ఉంది. కరీనంగర్ జిల్లా గన్నేరు వరం మండలం పారువెల్ల, గన్నేరువరం చెరువులు మత్తడి పారుతున్నాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట పాత, కొత్త చెరువులు అలుగు పారుతున్నాయి. ముఖ్యంగా సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. కోహెడ, హుస్నాబాద్ లో భారీ వానలు పడ్డాయి. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం దేవక్కపల్లి, వరుకోలు గ్రామాల మధ్య మొయదుమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వంతెన పై నుంచి వరద వెళ్తోంది.

సిరిసిల్ల జిల్లాలో కూడా భారీ వర్షాలు కురిశాయి. మిడ్ మానేరు నిండిపోయింది. మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. మందమర్రి, శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాల్లోని ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. భారీ వర్షంతో మంచిర్యాల పట్టణంలో పలు కాలనీల్లోకి నీరు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 3 లక్షల 5 వేల 692క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్ ఫ్లో 3 లక్షల 27 వేల 762 క్యూసెక్కులుగా ఉన్నట్లు అధికారులు చెప్పారు.
ఇటు ఎల్లంపల్లి కూడా నిండు కుండలా మారింది. గేట్లు ఎత్తి నీటిని కింది వదలుతున్నారు. గోదావరి క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. వర్షాలు ఇంకా ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు.












Click it and Unblock the Notifications