Rice: సన్న బియ్యానికి పెరిగిన డిమాండ్.. ధరలు భారీగా పెంచుతున్న వ్యాపారులు..
సన్న బియ్యం ధరలు భారీగా పెరుగుతున్నాయి. వ్యాపారులు నెలానెల ధరలు పెంచుకుంటూ పోతున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇప్పటికే దాదాపు వెయ్యి రూపాయలకు పైగా పెంచారు. రాష్ట్రంలో సన్న వరి సాగు తగ్గడం.. సన్న బియ్యానికి కొరత ఏర్పడడంతో వ్యాపారులు గత రెండు నెలల్లో రూ.300 వరకు పెంచారు.
సన్న బియ్యం ధరలు పెరగడంతో కేంద్రం బాస్మతీయేతర బియ్యం ఎగుమతి పై నిషేధం విధించింది.
అయితే రాబోయే కాలంలో ధరలు పెరుగుతాయని భావిస్తున్న వ్యాపారులు బియ్యాన్ని బ్లాక్ చేసి కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. దీంతో ధరలు ఇంకా పెరుగుతున్నాయి. రెండు సంవత్సరాల క్రితం తెలంగాణలో విసృతంగా తెలంగాణ సోనా సాగు చేశారు. అయితే సన్నాలు.. దొడ్డు వడ్ల కంటే తక్కువ దిగుబడి వచ్చాయి. అయితే తెలంగాణ సోనా వడ్లను దొడ్డు వడ్ల ధరకే కొనుగోలు చేశారు. దీంతో చాలా మంది రైతులు అధిక దిగుబడి కోసం దొడ్డు వడ్లను సాగు చేస్తున్నారు.

జై శ్రీరాం, హెచ్ఎంటీ, బీపీటీ, జగిత్యాల సోనా, తెలంగాణ సోనా సాగు చేస్తున్న రైతలు అధిక పెట్టుబడితో పాటు ధర కూడా సరిగా రావడం లేదు. దొడ్డు వడ్లతో పోలిస్తే సన్నాలకు ఎకరానికి రూ.10 వేల పెట్టుబడి అధికంగా అవుతుంది. దీంతో 2022 వానకాలం సీజన్ నుంచే రైతులు సన్నాల సాగు తగ్గించేశారు. చాలా మంది రైతులు వారి కుటుంబానికి సరిపోయే స్థాయిలోనే సన్నాలు సాగు చేస్తున్నారు. దీంతో సన్న బియ్యానికి డిమాండ్ ఏర్పడింది.
ఈ సంవత్సరం వానకాలం సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 44 లక్షల ఎకరాల్లో నాట్లు వేస్తుండగా, ఇందులో 11 లక్షల ఎకరాలకు మించి సన్నాలు సాగయ్యే అవకాశం లేదని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. సన్నా బియ్యానికి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో దొడ్డు బియ్యం వాడకం క్రమంగా తగ్గి.. సన్న బియ్యం క్రమంగా పెరుగుతోంది. అటు విదేశాల్లో కూడా సన్న బియ్యానికి డిమాండ్ ఏర్పడింది. దీంతో వ్యాపారులు సన్న బియ్యం ధరలు భారీగా పెంచారు.
ఇప్పటికే టమాటా, పచ్చి మిర్చి, అల్లం, ఉల్లి, చింతపండు ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు బియ్యం ధరలు కూడా పెరగడంతో ఇబ్బందులు పడుతున్నారు.












Click it and Unblock the Notifications