భారీ వర్షాల ఎఫెక్ట్.. తెలంగాణ వ్యాప్తంగా 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం
తెలంగాణ రాష్ట్రంలో ఊహించని రీతిలో కుండపోత వర్షాలు దంచికొట్టాయి. ఎప్పుడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదై.. పలు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమై గ్రామాలు, పట్టణాలు నీటిలో మునిగిపోయాయి. వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వంతెనలు, కల్వర్టులు సైతం కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగి.. అనేక ఊళ్లు బయట ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి జలదిగ్బంధమయ్యాయి. రహదారులు దెబ్బతినడంతో వాహనాలు మధ్యలోనే ఆగిపోయి, ట్రాఫిక్ గంటల కొద్దీ స్తంభించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఆర్అండ్‌బీ శాఖ నివేదిక..
రాష్ట్ర వ్యాప్తంగా 37 ఆర్ అండ్ బీ డివిజన్ల నుండి అందిన నివేదిక ప్రకారం.. ఇప్పటి వరకు 794 సమస్యాత్మక రోడ్లు గుర్తించారు. మొత్తం 1,039 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయని.. 31 చోట్ల రోడ్లు పూర్తిగా తెగిపోగా.. 10 చోట్ల తాత్కాలిక పునరుద్ధరణ చేపట్టినట్టు స్పష్టం చేశారు. 356 చోట్ల కాజ్‌వేలు, కల్వర్టులు నాశనం కావడంతో రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 289 చోట్ల ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసి.. 236 ప్రాంతాల్లో ట్రాఫిక్ క్లియర్ చేసినట్లు అధికారులు తెలిపారు.

సిడీ వర్క్స్ విషయంలో కూడా 206 ప్రాంతాలు నష్టపోయాయని గుర్తించారు. తాత్కాలిక పునరుద్ధరణకు రూ.53.76 కోట్లు అవసరమని, శాశ్వత పునరుద్ధరణ పనులకు సుమారు రూ.1,157.46 కోట్లు ఖర్చవుతుందని ఆర్ అండ్ బీ శాఖ అంచనా వేసింది.
వాతావరణ శాఖ హెచ్చరికలు..
మరోవైపు వాతావరణ శాఖ తాజా బులెటిన్ ప్రకారం.. తెలంగాణలో ఇంకా నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్, మేడ్చల్, మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు నుంచి అత్యంత భారీ వర్షపాతం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఇక వర్షాల ప్రభావంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో మరమ్మత్తు పనులు ఆలస్యమవుతున్నాయి. నీటి మోటర్లు, బోరువెల్లల్లోకి మురుగు చేరడంతో త్రాగునీటి సమస్యలు తలెత్తాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో అంబులెన్స్‌లు, అత్యవసర సేవల వాహనాలు కూడా కదలికలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం పరిస్థితిని పర్యవేక్షిస్తూ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు వర్షపాతం ప్రభావిత ప్రాంతాల్లో మూసివేసి సెలవులు ఇచ్చారు.
జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి..
ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకూడదని, వాగులు, వంకలు పొంగినప్పుడు దాటేందుకు ప్రయత్నించవద్దని అధికారులు హెచ్చరించారు. రాత్రి వేళల్లో వాహనాలు నడపేటప్పుడు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని విపత్తు నిర్వహణ విభాగం విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications