
మునుగోడుపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..!!
తెలంగాణలో మునుగోడు కేంద్రంగా రాజకీయలు హీటెక్కుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. ఈ నెల 14వతేదీతో నామినేషన్లకు సమయం ముగియనుంది. మూడు ప్రధాన పార్టీలకు మునుగోడు గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. ఈ సమయంలో ఎన్నికల సంఘం మునుగోడు పరిణామాలను డేగ కన్నుతో పరిశీలిస్తోంది. పలు ప్రాంతాల్లో నగదు దొరుకుతుండటంతో మరితంగా అప్రమత్తమైంది. అందులో భాగంగా ఎన్నికల నిర్వహణ కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కడా ఉప ఎన్నికలో అవకతవకలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఇప్పటికే ఓటర్ల జాబితా పైన బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. అటు నగదు పెద్ద ఎత్తున పంపిణీ చేయటానికి సిద్దమయ్యారంటూ రాజకీయంగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో..ఎన్నికల సంఘం మునుగోడు ఎన్నికల నిర్వహణకు ముగ్గురు పరిశీలకులను నియమించింది. ప్రతీ ఎన్నికలో ఇదే తరహాలో పరిశీలకుల నియామకం జరుగుతుంది. కానీ, మునుగోడు లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల్లో వీరి పాత్ర కీలకం కానుంది. ఇప్పటికే దాదాపుగా రూ 10 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో ఎన్నికల సంఘం సాధారణ పరిశీలకునిని, పోలీసు పరిశీలకున్ని, వ్యయ పరిశీలకుడిని నియమించింది. సాధారణ పరిశీలకునిగా మహారాష్ట్ర ఐఏఎస్ అధికారి పంకజ్ కుమార్‌ను ఈసీ నియమించింది.

ఈ నెల 14 వ తేదీ నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు మునుగోడులో పరిశీలకునిగా కొనసాగనున్నారు. అదే విధంగా..పోలీసు పరిశీలకునిగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి మయాంక్ శ్రీవాస్తవను నియమిస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14 వ తేదీ నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు విధుల్లో ఉంటారు. వ్యయ పరిశీలకులుగా ఐఆర్ఎస్ అధికారిణి సమతా ముళ్లమూడిని నియమించారు. వ్యయ పరిశీలకులు ఈ నెల 13వ తేదీ నుంచి పోలింగ్ తేదీ అయిన నవంబర్ మూడో తేదీ వరకు మునుగోడు నియోజకవర్గంలో విధులు నిర్వర్తిస్తారు. ఈ ముగ్గురు ఎన్నిక తమకు సంబంధించిన విధుల్లో చేరాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.