తెలంగాణ నుంచి "పెద్దలు" ఎవరు - షెడ్యూల్ విడుదల : కవితకు ఛాన్స్ ఖాయమంటూ..!!
రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయింది. దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో.. 57 రాజ్యసభ సీట్లకు ఎన్నికలకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఖాళీకానున్న రాజ్యసభ సీట్ల కోసం మే 24 నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలుకానుంది. జూన్ 1వ తేదీన నామినేషన్లను పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు జూన్ 3 వరకు గడువు ఉంటుంది. జూన్ 10న ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 57 సీట్లలో..తెలంగాణ నుంచి రెండు సీట్లు భర్తీ చేయాల్సి ఉంది.

పెరిగిపోతున్న ఆశావాహుల సంఖ్య
తెలంగాణ నుంచి కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ధర్మపురి శ్రీనివాస్‌లు రిటైర్ అవుతున్నారు. ఇప్పటికే బండా ప్రకాశ్ స్థానం భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. దీంతో..ఇప్పుడు పెద్దల సభకు ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉంది. శాసనసభలో సంఖ్యా బలంతో మూడు స్థానాలు టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. దీంతో..ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది. అందులో ప్రధానంగా ప్రకాశ్ రాజ్..కేసీఆర్ కుమార్తె కవిత.. బోయినపల్లి వినోద్ కుమార్.. మోత్కుపల్లి నర్సింహులు..పొంగులేటి శ్రీనివాసులరెడ్డి పేర్లు రేసులో ఉన్నాయి. అయితే, జాతీయ రాజకీయాల పైన వ్యహాత్మకంగా అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ ఢిల్లీలో అవసరాలు.. జాతీయ స్థాయిలో ఇతర పార్టీలతో మంతనాలు.. రాయబారాలు నడిపే వారికి ప్రాధాన్యత ఇస్తూ..అదే సమయంలో సామాజిక సమతుల్యత అధారంగా నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.

కవిత - ప్రకాశ్ రాజ్ కు ఖాయమంటూ
ఇప్పటికే పార్టీ నుంచి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే విధంగా.. కేసీఆర్ కుమార్తె కవిత పేరు ఖాయమని చెబుతున్నారు. ఈ ఇద్దరికీ ఢిల్లీలో జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ తరపున కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఇతర పార్టీల నేతలను కలిసే సమయంలోనూ కవితను వెంట బెట్టుకెళ్లారు. కవిత సైతం ఎంపీగా ఉన్న సమయంలో అన్ని పార్టీల నేతలతోనూ సన్నిహితంగా ఉండేవారు. అదే విధంగా ముంబాయిలో మహారాష్ట్ర సీఎం థాక్రేను కలిసేందుకు వెళ్లిన సమయంలో... ప్రకాశ్ రాజ్ ను సీఎం కేసీఆర్ ఆయనకు పరిచయం చేసారు. ఆ సందర్భంలో ప్రకరాశ్ రాజ్ కు సీఎం ఇచ్చిన ప్రాధాన్యత పార్టీలో చర్చకు కారణమైంది.

సీఎం కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ
ఇక, వినోద్ కుమార్ సైతం పార్టీ లో తొలి నుంచి సీఎం కేసీఆర్ కు విధేయుడిగా.. పలు పార్టీల నేతలతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తిగా పేరుంది. ఇక, మోత్కుపల్లి నర్సింహులుకు గతంలోనే ఎమ్మెల్సీ లేదా నామినేటెడ్ పదవి దక్కుతుందని భావించినా..దక్కలేదు. దీంతో..ఆయన్ను పెద్దల సభకు పంపే ఆలోచన జరుగుతోందనది మరో వాదన. ఇక, కొంత కాలంగా ఎటువంటి అవకాశాలు లేక.. నిరీక్షిస్తున్న ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసుల రెడ్డి ఈ సారి రాజ్యసభకు తనకు అవకాశం దక్కుతుందని ఆశిస్తున్నారు. అయితే, అంతు చిక్కని వ్యూహాలతో నిర్ణయాలు తీసుకొనే సీఎం కేసీఆర్ చివరకు వీరిలో ఎవరికి అవకాశం ఇస్తారనేది ఇప్పుడు పార్టీలో ఉత్కంఠకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications