రైతు రుణామాఫీపై రేవంత్ కు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు..!!
తెలంగాణ మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. శనివారం జరగాల్సిన మంత్రివర్గ సమావేశం ఎన్నికల సంఘం అనుమతి రాకపోవటంతో వాయిదా పడింది. అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష చేసారు. కేబినెట్ భేటీలో రైతు రుణమాఫీతో పాటుగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు...ఉమ్మడి రాజధానిలో ఏపీకి కేటాయించిన ఆస్తుల పైన నిర్ణయం తీసుకోవాలని భావించారు. కానీ, ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది.
ఈసీ అనుమతి
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగియటంతో సీఎం రేవంత్ మంత్రివర్గ సమావేశానికి నిర్ణయించారు. ఆ భేటీలో రైతు రుణమాఫీతోపాటు, రాష్ట్ర ఆదాయం పెంపు, వర్షాకాల సీజన్ లో చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ ప్రధానంగా చర్చించే విధంగా అజెండా ఫిక్స్ అయింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోవాలని భావించారు. ఆగస్టు 15 నాటికి రైతు రుణ మాఫీఅమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ఎంపీ ఎన్నికల ప్రచారంలో పలు మార్లు హామీ ఇచ్చారు. ఇందు కోసం కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

షరుతులు వర్తిస్తాయి
అయితే, ఎన్నికల సంఘం అనుమతి రాక ఆ సమావేశం జరగలేదు. ఇప్పుడు తాజాగా ఎన్నికల సంఘం కేబినెట్ భేటీకి అనుమతి ఇస్తూనే కొన్ని షరతులు విధించింది. కేబినెట్ సమావేశం నిర్వహించుకోవచ్చని చెబుతూనే.. రైతు రుణమాఫి, ఉమ్మడి రాజదాని అంశాలపై చర్చించకుండా.. కేబినెట్‌లో అత్యవసరమైన విషయాలపైనే చర్చించాలని షరతులతో కూడిన అనుమతినిచ్చింది. ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు కేబినెట్ భేటీకి వెళ్లకూడదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీంతో..రైతు రుణమాఫీ అమలు దిశగా ప్రభుత్వం అధికారిక నిర్ణయం ఎన్నికల కోడ్ పూర్తయిన తరువాతనే ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కోడ్ తరువాతే రుణమాఫీ నిర్ణయం
రైతుల రుణమాఫీ అమలు దిశగా రేవంత్ ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించారు. రుణమాఫీ కోసం దాదాపు రూ. 40 వేల కోట్లు అవసరం. ఇందుకు సంబంధించి రైతు కార్పోరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే అధికారులు బ్యాంకర్లతో ఈ అంశం పైన చర్చించి ప్రతిపాదనలు సిద్దం చేసారు. కేబినెట్ సమావేశం జరిగితే..అందులోనే రైతు కార్పోరేషన్ పై నిర్ణయం తీసుకోవాలని భావించింది. ఇప్పుడు ఈ నిర్ణయం వాయిదా పడనుంది. ఇప్పుడు ఎన్నికల సంఘం మంత్రివర్గ భేటీకి అనుమతి ఇవ్వటం సమావేశం నిర్వహణ పైన ప్రభుత్వం సమయం ఖరారు చేయాల్సి ఉంది. ఈ భేటీలో ధాన్యం కొనుగోళ్ల పురోగతిని కేబినెట్ సమీక్షించనుంది. జూన్ నెల అరంభం నుంచి ఖరీఫ్ పంట సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో విత్తనాలు, ఎరువులు, నీటి ప్రణాళికపై చర్చ జరుగనుంది.












Click it and Unblock the Notifications