తెలంగాణలో మళ్లీ ఎన్నికలు... మోగనున్న నగారా ??
తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఈ ఎన్నికలు జరిగే అవకాశముందని భావిస్తున్నారు. దీంతో మరోమారు రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగనుందని చర్చ నడుస్తుంది.
ఈ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహణకు గత సెప్టెంబరు 29న నోటిఫికేషన్ విడుదల చేయగా, నామినేషన్లు కూడా మొదలయ్యాయి. అయితే, బీసీ రిజర్వేషన్లపై పిటిషన్ విచారణ కారణంగా రాష్ట్ర హైకోర్టు అక్టోబరు 9న ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత హైకోర్టు అనుమతితో గ్రామ పంచాయతీలు, పురపాలక సంఘాలకు ఎన్నికలను విజయవంతంగా నిర్వహించారు. రిజర్వేషన్ల విధానం ప్రకటించిన అనంతరం, హైకోర్టు అనుమతితో మే నెలలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.

కాగా ఎస్‌ఈసీ ఆదేశాల ప్రకారం, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి మినహా అన్ని జిల్లాల కలెక్టర్లు కేంద్ర ఎన్నికల సంఘం నవీకరించిన (10.07.2025 నుండి 05.02.2026 వరకు) జాబితాలోని అదనపు ఓటర్లను గుర్తించాలి. మండలాల వారీగా వారిని సంబంధిత పంచాయతీ, పోలింగ్ కేంద్రాల జాబితాల్లో జత చేయాల్సి ఉంటుంది. ఈ సమాచారం ఆధారంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ పరిధిలోని గ్రామ పంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త జాబితాలు రూపొందించాలి. జిల్లా పంచాయతీ అధికారి ధ్రువీకరించాక, 'సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్' (సీజీజీ) యూజర్ మాన్యువల్ ప్రకారం పోలింగ్ కేంద్రాలకు ఈ జాబితాలను అనుసంధానించాలని ఎస్‌ఈసీ పేర్కొంది.
అయితే డేటాలో ఏవైనా వ్యత్యాసాలుంటే ఈ నెల 23వ తేదీలోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని అధికారులు సూచించారు. ఆమోదం అనంతరం గ్రామాల వారీగా ముసాయిదా జాబితాలు విడుదలవుతాయి. అభ్యంతరాలు స్వీకరించాక తుది జాబితా ప్రకటన, తదుపరి పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర ఏర్పాట్లు చేపడతారు. ఇక చివరిసారిగా 2019 మే 6, 10, 14 తేదీల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు ప్రకటించాక జూన్‌లో ఎంపీపీ, జడ్పీ చైర్‌పర్సన్‌లను ఎన్నుకున్నారు. గత ఏడాది జూన్‌తో వారి పదవీకాలం ముగియడంతో, అప్పటి నుండి ఆయా స్థానాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.
మరోవైపు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే 566 జడ్పీటీసీ స్థానాలు (అదే సంఖ్యలో ఎంపీపీలు), 5,773 ఎంపీటీసీ స్థానాల జాబితాను రూపొందించి ఎస్‌ఈసీకి సమర్పించింది. ఈ స్థానాలను ఖరారు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మేడ్చల్-మల్కాజిగిరిని అర్బన్ జిల్లాగా మార్చడంతో, అది జిల్లా పరిషత్‌ల జాబితా నుండి తొలగించబడింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్‌లు ఉన్నాయి. 2019 తర్వాత అనేక గ్రామ పంచాయతీలు పురపాలికలు, నగరపాలికల్లో విలీనం కావడంతో గ్రామాల సంఖ్య తగ్గింది. గ్రామాల సంఖ్య తగ్గుదల కారణంగా మొత్తం 44 ఎంపీటీసీలు, నాలుగు జడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీ స్థానాలు తగ్గిపోయాయని సమాచారం.












Click it and Unblock the Notifications