పాలకుర్తి బరిలో ఎర్రబెల్లి వర్సెస్ యశస్విని రెడ్డి: గెలుపెవరిది?
తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల పోరు హోరాహోరీగా సాగుతుంది. అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. అయితే ఈ సారి దిగ్గజ నేతలకు కూడా టెన్షన్ తప్పటం లేదు. ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి ప్రాతినిధ్యం వహించిన పాలకుర్తి నియోజకవర్గంలో ఎన్నికల పరిస్థితి హాట్ హాట్ గా మారింది.
నియోజక వర్గాల పునర్విభజనలో చెన్నూరు నుంచి ఏర్పడిన పాలకుర్తి... జనగామ జిల్లాలోని మూడు నియోజకవర్గాలలో ఒకటి. మహబూబాబాద్ జిల్లాలో కూడా కొంత విస్తరించింది. రెండున్నర లక్షలమంది పైగా ఉన్న ఓటర్లలో గణనీయంగా ఉన్న కొత్త ఓటర్లు అభ్యర్ధుల గెలుపోటములను నిర్ణయించే అవకాశం ఉంది.

BRS సిట్టింగు సభ్యులు, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నియోజకవర్గం నుంచి నాల్గోసారి విజయం కోసం పోటీ పడుతుండగా, కాంగ్రెస్ అభ్యర్ధి మామిడాల యశస్విని రెడ్డి, BJP అభ్యర్ధి లేగ రామ్మోహన్ రెడ్డి, మరో 12 మంది అభ్యర్థులు పోటీ ఇస్తున్నారు. ముఖ్యంగా పాలకుర్తిలో ద్విముఖ పోరు కొనసాగుతుంది.
పాలకుర్తికి తాను చేసిన అభివృద్ధిని చూసి తనను మళ్ళీ గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ దయాకర్ రావు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే స్థానికంగా దయాకర్ రావు అనుచరుల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టుగా, వారంతా దయాకర్ రావుపై తీవ్ర అసహనంతో ఉన్నట్టు చర్చ జరుగుతుంది.
కాంగ్రెస్ అభ్యర్థి యశస్విని రెడ్డి నియోజవర్గంలో తన ప్రచారాన్ని ఉధృతం చేశారు. PCC అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలో ప్రసంగించారు. తాజాగా ప్రియాంకా గాంధీ బహిరంగ సభలో మాట్లాడి పాలకుర్తి అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
యశస్విని రెడ్డి కుటుంబ సభ్యులూ గత ఎనిమిది నెలలుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. సిట్టింగు సభ్యునిపై వ్యతిరేకత, ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు తనకు కలసి వస్తాయని యశస్విని రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక, కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు రాష్ట్రంలోనూ అమలవ్వాలంటే తనకు ఒక అవకాశం ఇవ్వాలని BJP అభ్యర్థి రామ్మోహన్ రెడ్డి కోరుతున్నారు. అయితే ఇక్కడ ద్విముఖ పోరు ఎర్రబెల్లి వర్సెస్ యశస్విని రెడ్డి హోరాహోరీగా కొనసాగుతుంది.












Click it and Unblock the Notifications