తూగో-పగోలకు ధీటుగా వరంగల్: కెసిఆర్, బాబు చేతులెత్తేశారు: ఎర్రబెల్లి
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే ఏపీలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు తీసిపోని విధంగా వరంగల్ జిల్లా అవుతుందని తెలంగాణ సీఎం కెసిఆర్ గురువారం నాడు అన్నారు. టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావు కెసిఆర్ సమక్షంలో అధికారికంగా కారు ఎక్కారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడారు.
పదిహేనేళ్ల పాటు కష్టపడి తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. సాధించిన తెలంగాణ నిలిచి గెలవాలన్నారు. తెరాసలోకి చేరికలను రాజకీయ కోణంలో చూడవద్దన్నారు. తెరాసలో ఎవరు చేరినా రాజకీయ పునరేకీకరణలో భాగమని భావించాలన్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ అన్ని విషయాల్లోను దోపిడీకి, నిరాదకరణకు గురయిందని చెప్పారు. దళితులు, గిరిజనులు, బీసీలు, అగ్రకులాలు.. ఇలా ఎవరు అభివృద్ధి చెందలేదన్నారు. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను చేయాలన్నారు. అప్పుడే తెచ్చుకున్న తెలంగాణకు ఫలితం ఉంటుందన్నారు.

ప్రజల్లో మనకు మంచి ఆదరణ ఉందని, దానిని ఒడిసి పట్టుకోవాలన్నారు. ప్రతి బడ్జెట్లో వరంగల్ జిల్లాకు రూ.300 కోట్లు కేటాయిస్తామన్నారు. ప్రాజెక్టులు లేకపోవడం వల్ల గోదావరి నీళ్లు వృథాగా వెళ్లిపోతున్నాయన్నారు. ఇప్పుడు వేసిన పునాదుల పైనే తెలంగాణ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు.
కాళేశ్వరం పూర్తయితే వరంగల్ జిల్లాలో రెండు పంటలకు సాగునీరు ఇస్తామని చెప్పారు. తెలంగాణ బాగు కోసమే అందరూ ఒక్కతాటి పైకి వస్తున్నారని చెప్పారు. వరంగల్ పట్టణ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని కెసిఆర్ చెప్పారు.
చంద్రబాబు చేతులెత్తేశారు: ఎర్రబెల్లి
తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు కూడా తెలంగాణలో చేతులెత్తేశారన్నారు. టిడిపిలో ఎవరూ ఉండరని చెప్పారు. తప్పని పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలు సీఎం కెసిఆర్‌కు మద్దతు పలుకుతున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications