కడియం శ్రీహరిని అడ్డుకున్న ఎర్రబెల్లి: వరంగల్లో ఉద్రిక్తత, తోపులాట
వరంగల్/హైదరాబాద్: వరంగల్ జిల్లా కొడకండ్లలో ఆదివారం మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని తెలంగాణ టిడిపి శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర రావు అడ్డుకున్నారు. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కడియం శ్రీహరి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి ఆయనను అడ్డుకున్నారు. టిడిపి, టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. తోపులాట కూడా జరిగింది.

కాగా, మార్కెట్ యార్డులోని ఓ భవనం శంకుస్థాపన విషయంలో టీడీపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పాలకుర్తి మార్కెట్ యార్డులోని ఒక భవనం శంకుస్థాపన విషయమై టీడీపీ టీఆర్ఎస్ శ్రేణుల మధ్య మాటామాటా పెరిగింది.
దీంతో పరిస్థితి శృతి మించి ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. ఈ సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తప్పుదోవ పట్టిస్తున్నాయి: రసమయి బాలకిషన్
కొన్ని పత్రికలు తప్పుడు కథనాలు రాస్తున్నాయని టిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మండిపడ్డారు. కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. కొన్ని పత్రికలు రైతు ఆత్మహత్యలను పతాక శీర్షికలో రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు.
అదే వేరే దేశంలో అయితే తప్పుడు వార్తలు రాసిన జర్నలిస్టులను ఉరి తీసిన దాఖలాలు ఉన్నాయన్నారు. రైతులకు భరోసా కల్పించేలా పత్రికల రాతలు ఉండాలన్నారు. పిక్క కొడితే కరీంనగర్ జిల్లా కలెక్టర్‌ను అవుతానని బాలకిషన్ అన్నారు. పీహెచ్‌డి కోసం 500 మంది ప్రవేశ పరీక్ష రాస్తే జనరల్ కోటాలో తాను సీటు సంపాదించిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.
ఓటమి భయంతో ఓట్ల తొలగింపు: కిషన్ రెడ్డి
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ఓట్లను తొలగిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే టీఆర్ఎస్ ప్రభుత్వం భారీ సంఖ్యలో ఓట్లను తొలగించిందన్నారు.
కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ అధికార పార్టీకి ఆదరణ తగ్గుతోందన్నారు. జీహెచ్ఎంసీని 200 డివిజన్లు చేయాలని డిమాండ్ చేశారు. మజ్లిస్ పార్టీతో కుమ్మక్కై జీహెచ్ఎంసీలో అధికారం వారికి కట్టబెట్టాలని టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోందన్నారు.












Click it and Unblock the Notifications