కాంగ్రెస్ సర్కారుపై ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు: రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్, ముఖ్యమంత్రి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
సీఎం రేవంత్ ప్రజాస్వామ్యాన్ని మర్చిపోయి ప్రజలిచ్చిన అధికారాన్ని అడ్డంపెట్టుకొని దౌర్జన్యం చేస్తే.. గత పాలకులకు ఏ గతి పట్టిందో అదే గతి పడుతుందని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ద్వజమెత్తారు.
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో పలు కాలనీ సంఘాలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రసంగించారు ఈటల. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్ మాదిరిగానే.. నేటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుందని ఈటల అనుమానం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మెప్పు పొందడానికి బిల్డర్లను, వ్యాపారవేత్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఈటల రాజేందర్ ఆరోపించారు. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఖబర్ధార్ అంటూ హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, దేశ ప్రజలకు ధైర్యాన్ని అందించిన నాయకుడు నరేంద్ర మోడీ అని వ్యాఖ్యానించారు. తనకు మద్దతు ప్రకటించిన పలు కాలనీ సంఘాలకు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
రేవంత్ ఒళ్లు, నోరు దగ్గర పెట్టుకొని వ్యవహరించాలి. ఇవాళ అధికారం ఉందని ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించడానికి సిద్ధంగా లేరు అంటూ ఈటల రాజేందర్ హెచ్చరించారు. గతంలో కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి, రాజకీయ నాయకుల కాల్స్‌ను ట్యాపింగ్ చేశారు. అదే కోవలో ఈనాడు కాంగ్రెస్ పార్టీ కూడా వ్యవహరిస్తోందని ఈటల సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణకు మీరే అన్ని అనుకుంటే పొరపాటు. మీపైనా నిఘా పెట్టిన వారు ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఈటెలకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్
ఈటల రాజేందర్ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై సీఎం రేవంత్ తీవ్రంగా స్పందించారు. చిల్లర మాటలు మానుకోవాలని ఆయన ఈటలకు హితవు పలికారు. కేంద్రంలో వాళ్ల ప్రభుత్వమే(బీజేపీ) అధికారంలో ఉన్నందున ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ చేయించాలని రేవంత్ డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలా తమకు ఆలాంటి అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
గతంలో ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్లు ఏమయ్యారో ప్రజలకు తెలుసన్నారు సీఎం రేవంత్. కరీంనగర్‌లో రూ.7 కోట్లు దొరికినందుకు ఈటలకు బాధగా ఉన్నట్లుందని రేవంత్ ఎద్దేవా చేశారు. స్థానికంగా వచ్చిన సమాచారంతోనే పోలీసులు ఆ డబ్బు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌తో కాదని చెప్పారు. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగానే వ్యవహరించిన తాను.. ఇప్పుడు ఎన్నికల నియమావళి రావడంతో ఇవాళ్టి నుంచి పీసీసీ చీఫ్‌గా వ్యవహరించనున్నట్లు చెప్పుకొచ్చారు. ఇక నుంచి పక్కా రాజకీయాలే చేస్తానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications