కొన్ని మీడియా ఛానళ్లు విషం కక్కుతున్నాయి: ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలంగాణ భారతీయ జనతా పార్టీపై కొందరు, కొన్ని మీడియా ఛానళ్లు విషం కక్కే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటయ్యారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వరంగల్‌లో జులై 8న ప్రధాని నరేంద్ర మోడీ సభ నేపథ్యంలో హనుమకొండలో ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చాలా బలంగా ఉందని.. చాపకింద నీరులా పార్టీ విస్తరిస్తోందని ఈటల చెప్పారు. ఠక్కున పైకి వెళ్లి పోవడానికి.. రాజకీయాలేమీ సెన్సెక్స్ కాదని అన్నారు. తెలంగాణ గడ్డపై తమ విజయపరంపర 2019 ఎంపీ ఎన్నికలతో మొదలైందన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ, గ్రేటర్ వరంగల్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటామని చెప్పారు.

మునుగోడులోనూ నైతికంగా బీజేపీనే గెలిచిందన్నారు ఈటల రాజేందర్. కేసిఆర్ కుటుంబ పాలనను ఒదిలే ప్రసక్తే లేదన్న ఈటల.. చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని తేల్చి చెప్పారు. ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసన్న ఈటల రాజేందర్.. చాప కింద నీరులా బీజేపీ పని చేసుకుంటున్నామన్నారు. కుట్రలను, కావాలని సృష్టించే ఆరోపణలను తెలంగాణ ప్రజలు నమ్మరని ఈటల స్పష్టం చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చినా రాష్ట్రం రైతులకు ఇచ్చే పరిస్తితి లేదని విమర్శించారు.

ప్రధాని పర్యటనపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే సమీక్ష నిర్వహించారని తెలిపారు. పార్టీ యంత్రాంగమంతా ప్రధాని సభను విజయవంతం చేస్తుందన్నారు. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడానికి ప్రధాని మోడీ వస్తున్నారన్నారు. ఎన్నో ఏళ్ల కల అయిన వ్యాగన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూమిపూజ చేస్తారని తెలిపారు. బీజేపీకి వరంగల్ బలమైన కేంద్రంగా ఉందన్న ఈటల.. మొదటి సారి ప్రధాని వస్తున్న సందర్భంగా ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications