27 తరువాత బీజేపీలో చేరికలు -రాజగోపాల్ కు వెల్ కం : ఈటల కొత్త నినాదం రెడీ..!!
ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓడించి తీరుతానని బీజేపీ ఎమ్మెల్యేల..మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి స్పష్టం చేసారు. సీఎం మీద పోటీ చేస్తానని..ఓడిస్తానని గతంలో చెప్పిన ఈటల మరోసారి ఈ అంశాన్ని స్పష్టం చేసారు. ప్రస్తుతం మంచి ముహుర్తాలు..మంచి రోజులు లేవని..దీని కారణంగానే బీజేపీలో చేరే వారు నిరీక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ నెల 27 తరువాత బీజేపీలో చేరికలు ఉంటాయని స్పష్టం చేసారు. అన్ని పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నారని వెల్లడించారు. ప్రధానంగా టీఆర్ఎస్.. కాంగ్రెస్ నేతలు తమతో టచ్ లో ఉన్నారని ఈటల చెప్పారు.

కాంగ్రెస్ కు ఓటు వేస్తే..
కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో రాదని.. తెలంగాణలోనే కాదు..ఎక్కడా రాదంటూ ఈటల వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈటల కొత్త నినాదం తెర మీదకు తెచ్చారు. కాంగ్రెస్ కి ఓటు వేస్తే టీఆర్ఎస్ కి ఓటు వేసినట్టే నని చెప్పుకొచ్చారు. ఇదే నినాదం బలంగా తీసుకెళ్లే విధంగా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. తాజాగా.. ఢిల్లీలో కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీని ఈడీ విచారించే సమయంలో నిరసనలకు మద్దతుగా విపక్షాలు చేసిన స్టేట్ మెంట్ పై టీఆర్ఎస్ నేతలు సంతకాలు చేసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎవరు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరినా వారిని ముందు ఉండి వాళ్ళను గెలిపిస్తామని ఈటల ధీమా వ్యక్తం చేసారు.

హుజూరాబాద్ ఫార్ములాతో ముందుకు
తాము ఇక రాష్ట్రంలో హుజురాబాద్ ఫార్ములా ప్రకారం పనిచేస్తామని వెల్లడించారు. గతంలో తిరుపితో మాట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కి కెసిఆర్ ను ఎదుర్కొనే సత్తా లేదు అని చెప్పిన విషయాన్ని ఈటల గుర్తు చేసారు. రాజగోపాల్ ఎలాగైనా కెసిఆర్ మీద కసి తీర్చుకోవాలని చూస్తున్నారుని చెప్పుకొచ్చారు. ఆ వేదిక బీజేపీ మాత్రమేనని..చెబుతూనే రాజగోపాల్ ను పార్టీలోకి రావాలంటూ ఈటల ఆహ్వానించారు. ఈటల ప్రస్తుతం చేరికల కమిటీ ఛైర్మన్ గా బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. తనకు టీఆర్ఎస్ లో పరిచయం ఉండి.. ప్రస్తుతం పార్టీ మారాలనే ఆలోచనతో ఉన్న నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు.

రాజగోపాల్ కు ఈటల ఆహ్వానం
జాతీయ నాయకత్వం సైతం ఈ సారి తెలంగాణ పైన ప్రత్యేకంగా ఫోకస్ చేయటం.. నేరుగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇక్కడి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. దీంతో..ముందుగా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ నిర్ణయం కోసం బీజేపీ నేతలు నిరీక్షిస్తున్నారు. ఉప ఎన్నికల ద్వారా..కేసీఆర్ ను తెలంగాణకు పరిమితం చేయాలనేది బీజేపీ ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో..నిజంగా ఈటల చెబుతున్నట్లుగా కాషాయం పార్టీలోకి చేరికలు ఉంటాయా... ఉప ఎన్నికలు తప్పవా అనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికర చర్చకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications