ఆయనో మాయల మరాఠీ.. నమ్మి మోసపోవద్దు: ఈటల రాజేందర్
బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ ప్రభుత్వం పై, తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికలు వస్తేనే కేసీఆర్ కు ప్రజలు గుర్తొస్తారని, మునుగోడులో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి, ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. మునుగోడులో గొల్ల కురుమలకు గొర్రెలు ఇస్తామని మోసం చేశారని, దళిత బంధు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు. కెసిఆర్ కు ప్రజలకంటే ఓట్ల మీదనే ప్రేమ అని చెప్పడానికి సజీవ సాక్ష్యం మునుగోడు ఎన్నికలన్నారు.
గత బడ్జెట్ లో 17660 కోట్లు దళిత బంధుకు కేటాయించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఈటల రాజేందర్ విమర్శించారు. మళ్లీ అంతే మొత్తం బడ్జెట్లో పెట్టారు. ఇది కేవలం దళితులను భ్రమలలో పెట్టీ వారి కళ్ళల్లో మట్టి కొట్టడానికే అంటూ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు మరో మోసం అని ఈటల రాజేందర్ విమర్శించారు. అక్రమ సంపాదన తెచ్చి నియోజకవర్గాలలో కులాలవారీగా, గ్రామాల వారికి ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

గొల్ల కురుమల కోసం ఖర్చుపెట్టిన 4000 కోట్లలో సగం డబ్బులు బ్రోకర్ల పాలు అయ్యాయన్నారు. కెసిఆర్ నీకు నిజంగా వారి మీద ప్రేమ ఉంటే బ్రోకర్లు లేకుండా మొత్తం డబ్బులు గొల్ల కురుమలకు ఇవ్వాలన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఎందుకు ఇవ్వలేదు అని అడగవద్దని, దళితబంధు అడగవద్దు అని, మిషన్ భగీరథ నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదు అని అడగవద్దు అని ఈ ఆత్మీయ సమ్మేళనాలు పెడుతున్నారు అంటూ పేర్కొన్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేవని, టెట్ ఇంతవరకు పెట్టలేదని, 2011లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చి, మళ్లీ 13 ఏళ్లకు మొన్న నోటిఫికేషన్ ఇచ్చేది కూడా రద్దు చేశారని మండిపడ్డారు.
బీహార్ లో కూడా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తున్నారని, కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదన్నారు. ఉద్యోగ నియామకాలు చేపట్టే టిఎస్పిఎస్సి లో కాంట్రాక్టు ఉద్యోగులను పెడుతున్నారని, అందుకే అక్కడ నియంత్రణ లేదని మండిపడ్డారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అభాసు పాలైందని, 30 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. పేపర్ లీక్ లో దోషి ప్రభుత్వం, భాధ్యత వహించాల్సింది తెలంగాణ ప్రభుత్వమని, జైల్లో ఉండాల్సింది పేపర్ లీక్ చేసిన వారు, టీఎస్పీఎస్సీ పెద్దలు కానీ కెసిఆర్ జైల్లో పెట్టింది మాత్రం బీజేవైఎం నాయకులను అంటూ మండిపడ్డారు .
తెలంగాణ రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తుందని, ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని ఈటల రాజేందర్ అభిప్రాయపడ్డారు. డబ్బులు తీసుకుని ఓటెయ్యండి మేము రాజ్యమేలుతామని కేసీఆర్ అంటుంటే ఇంకా కొనసాగిద్దామా చెప్పాలని ఈటల ప్రశ్నించారు. కెసిఆర్ మాయల మరాఠీ, బీఆర్ఎస్ ఇక్కడే గెలవడం లేదు. ఇంకా దేశంలో ఏం గెలుస్తుంది అంటూ ఈటల ఎద్దేవా చేశారు. మహిళలు లిక్కర్ వ్యాపారం చేయొచ్చా అంటూ ఢిల్లీ లిక్కర్ స్కాం టార్గెట్ చేసిన ఈటల కవిత పై విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications