కేసీఆర్ నీరో చక్రవర్తి.. ప్రశ్నిస్తే ప్రతిపక్షాలపై దాడులు: ఈటల ఆగ్రహం
తెలంగాణ సీఎం కేసీఆర్ పైన, తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతల తీరు పైన బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితులను పట్టించుకోని ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ధాన్యం తడిసి కన్నీరుమున్నీరవుతున్న రైతులను పరామర్శించేందుకు మంత్రులకు, ఎమ్మెల్యేలకు తీరిక లేదని సంబరాలలో మునిగి తేలుతున్నారు అని మండిపడ్డారు.
అసెంబ్లీలో వరి ధాన్యం మీద 600 గ్రాములు కంటే ఎక్కువ కట్ చెయ్యడం లేదు అని మంత్రిగారు చెప్పారని పేర్కొన్న ఈటల, స్పీకర్ కూడా నేనూ రైతునే కొనుగోలు సెంటర్స్ లో ఇబ్బందులు లేవు అని చెప్పారన్నారు. కానీ కొనుగోలు సెంటర్లలో ఎక్కడ ముందస్తు ఏర్పాట్లు చేయలేదని, ధాన్యం తడిసి రైతులు కన్నీరుమున్నీరవుతున్నా కెసిఆర్ మాత్రం నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కెసిఆర్ కు ప్రతిపక్షాల అంటే చిన్నచూపు ఉందని, రైతు సంఘాలు అంటే లెక్కే లేదని, అన్నీ తనకు తెలుసని అహంకారం తప్ప మరి ఇంకేమీ లేదని వ్యాఖ్యానించారు. తాము ఏదైనా మాట్లాడితే ఎదురుదాడి చేస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. హర్యానా, పంజాబ్ రైతులకు డబ్బులు ఇచ్చి వస్తున్నారు కానీ తెలంగాణ మట్టి బిడ్డల కళ్ళలో కన్నీళ్లను పట్టించుకోవడం లేదన్నారు.
అధికార పార్టీ నాయకులు, పోలీసులు ఇసుక మాఫియాకు అండగా ఉండి హుజురాబాద్ ను బొందల గడ్డ గా మారుస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్, పెద్దపల్లి, మానకొండూరు నియోజకవర్గాలు ఎడారిగా మారుతున్నాయి. దీనిపై సీఎం స్పందించాలన్నారు. ఇక దళితబంధు పధకంలో కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు వసూలు చేస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారని, అయితే దీనిపైన కొంతమంది సైకోలు ముక్కు నేలకు రాస్తానని మాట్లాడటం చూస్తున్నామని పాడి కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు.

అసలు అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలు ఎవరో నిజాయితీ ఉంటే కెసిఆర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. వారిని తక్షణం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆ డబ్బులు తిరిగి మళ్ళి డబ్బులు ఇచ్చిన దళితులకు ఇప్పించాలని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, కేసులు పెట్టడం, తీసుకొచ్చి కొట్టడం, కొట్టిన ఫోటోలను నాయకులకు పెట్టడం ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నడుస్తోందన్నారు.
కొంతమంది పోలీసులు అధికార పార్టీ నాయకులకు జీతగాళ్ల మాదిరిగా పని చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలీసులు అలాగే ఉన్నారని, కరీం నగర్ సిపి దీనిపై దృష్టి సారించాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. హుజురాబాద్ సీఐ, వీణవంక ఎస్సై ల మీద మానవ హక్కుల కమిషన్ కు తానే ఉత్తరాలు రాస్తానని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications