కేసీఆర్ ప్రధాని అవుతావా? ముందు వీఆర్ఏల సమస్య పరిష్కరించు: ఈటల రాజేందర్ చురకలు
తెలంగాణ రాష్ట్రంలో వీఆర్ఏ ల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22 వేల మంది గ్రామ రెవెన్యూ సహాయకులు సేవలు అందిస్తున్నారు. ఏళ్ల తరబడి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లేకపోవడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారుతోంది. ఈ క్రమంలో వీఆర్వో ల వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడంతో తమ భవిష్యత్తు ఏమవుతుందో అన్న ఆందోళనలో వీఆర్ఏలు ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా వీఆర్ఏలు తమ సమస్యలు పరిష్కరించాలని పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాట పట్టారు.

ఇందిరా పార్క్ వద్ద వీఆర్ఏ ల మహాధర్నాలో కేసీఆర్ పై మండిపడిన ఈటల రాజేందర్
మంగళవారంనాడు ఇందిరాపార్క్ వద్ద వీఆర్ఏలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని, తమకు వెంటనే పే స్కేలు జీవోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలు నిర్వహించిన మహాధర్నాలో పాల్గొన్న బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రధాని అవుతావా? అని ఎద్దేవా చేశారు. ప్రధాని అవ్వడానికి ముందు వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కెసిఆర్ ను టార్గెట్ చేశారు.

వీఆర్ఏల పోరాటానికి బిజెపి అండగా ఉంటుందని హామీ
వీఆర్ఏలు బాగుంటేనే గ్రామాలు పచ్చగా ఉంటాయని, వీఆర్ఏలకు సొంత గ్రామాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఏల డిమాండ్లను పరిష్కరించాలని వారికి పే స్కేల్ జీవోను వెంటనే విడుదల చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలలో వీఆర్ఏల సమస్యలపై బిజెపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది అని ఆయన పేర్కొన్నారు. వీఆర్ఏల పోరాటానికి బిజెపి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

కేసీఆర్ హయాంలో రెవెన్యూ శాఖ వెలవెలబోతుంది
ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన రెవిన్యూ శాఖ కేసీఆర్ హయాంలో వెలవెలబోతుందని ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు. ప్రజలతో సంబంధాలు కలిగిన రెవెన్యూ శాఖకు మంత్రి లేకపోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ పాలనలో నిరుద్యోగులకు కాదు, ఉద్యోగాలలో ఉన్న వారికి కూడా ఇబ్బందులు తప్పడం లేదని ఈటల రాజేందర్ ఆరోపించారు. ఎమ్మార్వో లపై పెట్రోల్ పోసిన చరిత్ర దేశంలో ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. పోలీసులు కూడా ఉద్యోగులే అన్న విషయాన్ని కెసిఆర్ మర్చిపోవద్దని ఆయన తెలిపారు.
Recommended Video

ఏపీలో ఉద్యోగుల విషయంలో జరిగింది కేసీఆర్ గుర్తు పెట్టుకోవాలన్న ఈటల రాజేందర్
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్నందుకు విజయవాడ చలో విజయవాడ తో భగ్గుమన్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకోవాలని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వీఆర్వో లను తొలగించి రెండేళ్ళుగా ఇంట్లోనే కూర్చోబెట్టారని, 2017 లో శివరాత్రి రోజున వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈటల రాజేందర్ సూచించారు. ప్రభుత్వం పై వీఆర్ఏలు చేస్తున్న పోరాటానికి తాము అండగా ఉంటామని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications