Praja Palana: నాలుగు నెలలకోసారి ప్రజాపాలన సదస్సులు: సీఎస్ శాంతి కుమారి కీలక ప్రకటన
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సదస్సులపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కీలక ప్రకటన చేశారు. ప్రజా పాలన సదస్సులు ముగియగానే దరఖాస్తుల్లోని డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టి.. జనవరి 17 నాటికి పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎస్ ఆదేశించారు. ప్రజాపాలన కార్యక్రమంపై కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి బుధవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
జనవరి 6 నుంచి 17 లోపు అన్ని దరఖాస్తుల డేటా ఎంట్రీ పూర్తి చేయాలని సూచించారు. మండల కేంద్రాల్లోనూ దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియ చేపట్టాలన్నారు. డేటా ఎంట్రీపై రాష్ట్రస్థాయి సిబ్బందికి జనవరి 4న, జిల్లా స్థాయి సిబ్బందికి జనవరి 5న శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎస్ తెలిపారు.

ఆధార్, తెల్ల రేషన్ కార్డు ప్రామాణికంగా లబ్ధిదారుల డేటా నమోదు చేయాలని సీఎం శాంతి కుమారి ఆదేశించారు. అంతేగాక, ఇకపై నాలుగు నెలలకోసారి ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీంతో ఇప్పుడు దరఖాస్తు చేయనివారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని సీఎస్ శాంతి కుమారి స్పష్టం చేశారు.
జనవరి నెల 28వ తేదీన ప్రారంభమైన ఆ కార్యక్రమానికి న్యూ ఇయర్ సందర్భంగా రెండ్రోజులు విరామం ఏర్పడింది. ఈ క్రమంలోనే తిరిగి జనవరి 2న ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు రెండు విడతలుగా గ్రామ, వార్డు సదస్సులు నిర్వహించారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
జనవరి 6 వరకు దరఖాస్తుల స్వీకరణకు అవకాశం ఉండటంతో కోటి దాటే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువగా మహాలక్ష్మి పథకంలోని గ్యాస్ సిలిండర్, 2,500, గృహజ్యోతి పథకంలోని 200 యూనిట్ల ఉచిత్ విద్యుత్, ఇళ్ల స్థలాల కోసం ఎక్కువగా అర్జీలు వస్తున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం పెద్దసంఖ్యలో దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications