సికింద్రాబాద్ నుంచి ఈ రైళ్ల పునరుద్దరణ - ముహూర్తం ఖరారు, ఇక రెగ్యులర్..!!
దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కొంత కాలంగా స్టేషన్ ఆధునీకరణ లో భాగంగా సికింద్రాబాద్ నుంచి పలు రైళ్లను వివిధ మార్గాల మీదుగా మళ్లించారు. దీని కారణం గా ప్రయాణీకులకు పలు సమస్యలు తలెత్తాయి. ఏప్రిల్ నుంచి సికింద్రాబాద్ నుంచి బయల్దేరాల్సిన రైళ్లను చర్లపల్లికి మార్పు చేసారు. ఇప్పుడు ఆధునీకరణలో భాగంగా ప్లాట్ ఫాంలు అందుబాటులోకి రావటంతో.. ప్రధాన ఎక్స్ ప్రెస్ రైళ్లను తిరిగి సికింద్రాబాద్ నుంచి పునరుద్దరించనున్నట్లు ప్రకటించారు.
పునరుద్దరణ
రైల్వే అధికారులు సికింద్రాబాద్ స్టేషన్ కు సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు. సుమారు రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పునరుద్ధరణ చేపట్టిన దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్).. అక్కడి నుంచి బయలుదేరే 25కి పైగా రెగ్యులర్ రైళ్లతోపాటు 50 వరకూ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లన్నీ గత ఏప్రిల్ నుంచి చర్లపల్లి నుంచి/ మీదుగా నడుపుతున్నారు. అత్యధిక డిమాండ్ ఉన్న ఎక్స్‌ప్రెస్ రైళ్ల మళ్లింపుతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్యాసింజర్ రెవెన్యూ (ఆదాయం) ఎక్కువగా ఉండే రైళ్ల మళ్లింపుతో రాబడి తగ్గినట్లు రైల్వే అధికారులు గుర్తించారు. దీనికి తోడు సికింద్రాబాద్ స్టేషన్‌లోని కొన్ని ప్లాట్ ఫామ్‌ల పునరుద్ధరణ పూర్తయింది. దీంతో ఇటీవల ఎస్‌సీఆర్ జనరల్ మేనేజర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో 'పాత రూట్లలోనే మఖ్యమైన ఎక్స్‌ప్రెస్ రైళ్ల'ను పునరుద్ధరించాలని నిర్ణయించారు.

ముహూర్తం ఖరారు
వచ్చేనెల ఏడో తేదీ నుంచి వివిధ రూట్లలో నడిచే 7 ఎక్స్‌ప్రెస్ రైళ్లను సికింద్రాబాద్ నుంచి నడపాలని నిర్ణయించారు. గతంలో లింగంపల్లి వైపు వెళ్లే రైళ్లు ఏప్రిల్ నుంచి సికింద్రాబాద్, బేగంపేట్ స్టేషన్లకు బదులు చర్లపల్లి నుంచి అమ్ముగూడ, సనత్‌నగర్ మీదుగా నడుస్తున్నాయి. తాజా నిర్ణయంతో ఆయా రైళ్లు తిరిగి సికింద్రాబాద్, బేగంపేట్ స్టేషన్లలో ప్రయాణీకులకు అందుబాటులోకి రానున్నాయి. రెగ్యులర్ రూట్లకు మళ్లుతున్న రైళ్ల వేళల్లో మార్పులు ఉండవని అధికారులు చెబుతున్నారు. అలాగే, చర్లపల్లిలో ఏర్పాటు చేసిన అదనపు స్టాపేజీని కొనసాగించనున్నట్లు తెలిసింది.
రెగ్యులర్ రూట్లలో
సికింద్రాబాద్ నుంచి ముందుగా ఏడు ప్రధాన రైళ్లను తిరిగి రెగ్యులర్ రూట్లలో ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. అందులో జన్మభూమి, శాతవాహన, విశాఖ- ముంబై ఎల్టీటీ, హదాప్సర్ ఎక్స్ ప్రెస్ రైళ్లను తిరిగి రెగ్యులర్ రూట్లలో నడవనున్నాయి. ఇక.. సాయినగర్ - కాకినాడ షిర్డీ వీక్లీ, మచిలీపట్నం- సాయి నగర్ షిర్డీ వీక్లీ, వాస్కోడీగామా ఎక్స్ ప్రెస్ లు ముందుగా రెగ్యులర్ రూట్లలో పునరుద్ధరించాలని నిర్ణయించారు.












Click it and Unblock the Notifications