అమ్మాయిలతో నకిలీ నోట్ల చెలామణి: ముఠా అరెస్ట్
హైదరాబాద్: ఎవరికీ అనుమానం రాకుండా అమ్మాయిలతో నకిలీ నోట్లను చెలామణి చేస్తున్న ముఠాను హైదరాబాద్ పోలీసులు ఛేదించారు. ప్రధాన సూత్రధారుడితోపాటు ముగ్గురు యువతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు వివరాలను మెహిదీపట్నంలోని అసిఫ్‌నగర్ ఏసిపి కార్యాలయంలో వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు, ఏసిపి గౌస్ మొయినుద్దీన్, టప్పాసుచబుత్ర ఇన్‌స్పెక్టర్ రవీందర్ మీడియాకు వెల్లడించారు.
ముషీరాబాద్‌కు చెందిన లక్ష్మీనారాయణ(42) అదే ప్రాంతంలో ప్రశాంతి టవర్స్‌లో లలితా ఎంటర్‌ప్రైజెస్ పేరిట టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. ఇతను అనంతపురం జిల్లాకు చెందిన శ్రీనాథ్ రెడ్డి(36) వద్ద నుంచి రూ. 1.24 లక్షల నకిలీ నోట్లను తీసుకున్నాడు. తన షాపులో టైలరింగ్ పని చేసే అనిత(24), సరిత(24), హారిక(22)లకు ఎక్కువ కమీషన్ ఇస్తానని ఆశపెట్టి వారితో గత కొంతకాలంగా చలామణి చేయిస్తున్నాడు. చిన్న చిన్న వస్తువులను కొనుగోలు చేస్తూ వారు వెయ్యి, ఐదు వందల నకిలీ నోట్లను గుట్టుచప్పుడు కాకుండా మార్పి చేస్తున్నారు.

కాగా, గురువారం అసిఫ్‌నగర్ జిర్రా ప్రాంతంలో లక్ష్మీనారాయణ బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతుండగా టప్పాసుచబుత్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా అతడి వద్ద రూ. 36వేల నకిలీ నోట్లు లభించాయి. దీంతో అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించగా, ముగ్గురు అమ్మాయిలతో కలిసి నకిలీ నోట్లు మార్పిడి చేయిస్తున్నట్లు వెల్లడించాడు.
తనకు అనంతపురానికి చెందిన శ్రీనాథ్ రెడ్డి నకిలీ నోట్లు అందిస్తున్నట్లు లక్ష్మీనారాయణ పోలీసుల విచారణ తెలిపాడు. శ్రీనాథ్ రెడ్డిని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. నిందితుల నుంచి నకిలీ నోట్లతో పాటు ఒక కారు, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిందితులను చాకచక్యంగా పట్టుకున్న టప్పాసుచబుత్ర డిఎస్ఐ నాగరాజు, ఇతర సిబ్బందిని డిసిపి అభినందించారు.












Click it and Unblock the Notifications