తెలంగాణ సచివాలయంలో నకిలీ తహసీల్దార్ కలకలం
తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోకి ఓ నకిలీ తహసీల్దార్ ప్రవేశించేందుకు ప్రయత్నించడం కలకలం రేపింది. తిప్పర్తి తహసీల్దార్ అని చెబుతూ అంజయ్య అనే వ్యక్తి నకిలీ ఐడీ కార్డుతో సచివాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడు. అయితే, అనుమానం వచ్చిన భద్రతా సిబ్బంది అతడ్ని అడ్డుకున్నారు.
ఆ తర్వాత తిప్పర్తి ఎమ్మార్వో కార్యాలయానికి ఫోన్ చేసి, వివరాలు తెలుసుకోవడంతో అంజయ్య నకిలీ తహసీల్దార్ అని తేలింది. ఈ క్రమంలో ఎస్‌టీఎఫ్ ఎస్ఐ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సైఫాబాద్ పోలీసులు.. అంజయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అంజయ్య వచ్చిన వాహనంపై కూడా తహసీల్దార్, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ అని స్టిక్కర్ కూడా ఉండటం గమనార్హం. కాగా, ఇటీవలే ఓ నకిలీ ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన మరువక ముందే మరోసారి అలాంటి ఘటనే చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ సమ్మిత్ కోసం వెళ్లి దావోస్ పర్యటనను విజయవంతంగా ముగించుకుని వచ్చిన నేపథ్యంలో తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్, హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు తనిఖీలు నిర్వహించారు.
తాను రెవెన్యూ శాఖలో జూనియర్ అస్టెంట్ ఉద్యోగినంటూ ఖమ్మంకు చెందిన భాస్కర్ రావు అనే వ్యక్తి హాజరయ్యాడు. పోలీసుల తనిఖీ సందర్భంగా భాస్కర్ రావు ఐడీపై అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తాను ప్రభుత్వ ఉద్యోగిని కాదని భాస్కర్ రావు తెలిపాడు. మైనార్టీ డిపార్ట్ మెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ డ్రైవర్ రవి.. తనకు ఫేక్ ఐడీ కార్డు తయారు చేయించినట్లు చెప్పాడు. దీంతో భాస్కర్ రావుతోపాటు డ్రైవర్ రవిని కూడా ఎస్పీఎఫ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications