నా అప్పు తీర్చకుంటే చస్తా: అసెంబ్లీ వద్ద టవరెక్కి హల్‌చల్, విషం తాగాడు (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎదురుగా ఉన్న సెల్ టవర్ ఎక్కి మంగళవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఓ సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు అక్కడికి చేరుకుని అతనితో మాట్లాడి కిందికి దించే ప్రయత్నాలు చేస్తున్నారు.

రేడియో సెల్ టవర్ ఎక్కింది రైతుగా తెలుస్తోంది. తన సమస్యలు పరిష్కరించాలని లేదంటే కిందకు దూకి, ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరిస్తున్నాడు. రైతు సెల్ టవర్ ఎక్కిన నేపథ్యంలో అసెంబ్లీ ఎదుట భారీ ట్రాఫిక్ జామ్ అయింది. అతను జై తెలంగాణ నినాదాలు కూడా చేస్తున్నాడు.

అతని పేరు సమ్మయ్యగా తెలుస్తోంది. వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతుగా తెలుస్తోంది. తనకు రూ.2 లక్షల అఫ్పు ఉందని, దానిని తీర్చి తనను గట్టెక్కించాలని ఆతను కోరుతున్నాడు. పోలీసులు అతనిని కిందకు దించే ప్రయత్నాలు చేస్తున్నారు.

సెల్ టవర్ పైనే పురుగుల మందు తాగాడు
సెల్ టవర్ ఎక్కిన రైతు సమ్మయ్య అక్కడే కొద్ది గంటల అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. తాను నెల రోజులుగా మంత్రులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నానని, అయినప్పటికీ కుదరడం లేదని, అందుకు నిరసనగా టవర్ ఎక్కి నిరసన తెలిపానని చెబుతున్నాడు. అనంతరం ఆయన పురుగుల మందు తాగాడు.

రైతు ఆత్మహత్యలపై ఏపీ, తెలంగాణలకు హైకోర్టు నోటీసులు
తెలుగు రాష్ట్రాల్లో రైతుల ఆత్మహత్యలు నిలువరించేందుకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్ పైన మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు రెండు తెలుగు ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతు ఆత్మహత్యలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రైతు ఆత్మహత్యలను తేలిగ్గా ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నించింది. రైతుల ఆత్మహత్యలకు కారణాలను అన్వేషించాలని సూచించింది. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ... తదుపరి విచారణను అక్టోబరు 13కు వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications