'అనధికారికంగా 1000మంది రైతులు ఆత్మహత్య', అధైర్యమొద్దని హరీష్
హైదరాబాద్: రైతులు అధైర్యపడవద్దని, బంగారు భవిష్యత్తు ముందు ఉందని, కరువును పారదోలేందుకు అపర భగీరథునిలా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సాగునీరు తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి హరీష్ రావు శనివారం అన్నారు.
ఆయన మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలో రైతుల ఆత్మహత్యలపై స్పందించారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇస్తామని, పగటిపూట 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పారు. నీటి కొరతతో బోర్లు వేసి మోటార్లు కాలిపోయి రైతులు అప్పుల పాలవుతున్నారన్నారు.
రైతుల ఆత్మహత్యలు: విపక్షాల భగ్గు
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణాలను ఏకకాలంలో మాఫీ చేసి, కరువు సహాయ ప్యాకేజీని ప్రకటించాలని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడ్డాయని, కరువు నిర్ధారణకు ఉన్నతస్థాయి కమిటీ వేయాలన్నారు.
తొలకరికి ముందుగానే రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కూడా పూర్తిస్థాయిలో కాలేదన్నారు. సమీక్షల పేరుతో బ్యాంకులు, ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతున్నాయన్నారు.
409 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ప్రభుత్వం ప్రకటించిందని, అనధికారిక లెక్కల ప్రకారం వెయి మందికి పైగానే ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతులు చనిపోతుంటే కెసిఆర్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉందని మండిపడ్డారు.
సిఎం జిల్లా.. మెదక్ ఆత్మహత్యల జిల్లాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వారిని ఓదార్చే సమయం కూడా ముఖ్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు. రుణమాఫీ విడతలవారీగా చేస్తుండటం, అదీ సరిగా చేయకపోవడంతో వడ్డీలకే సరిపోతున్నాయని, రైతులను ఆదుకోవాలన్నారు.
రాష్ట్రంలో కరవు నేపథ్యంలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికీ కెసిఆర్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టిడిపి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మండిపడ్డారు.

ఇదిలా ఉండగా, జూలై 24వ తేదీ వరకు 409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మెదక్ జిల్లాలోనే 67 మంది మృతి చెందారు. అయితే, వెయ్యికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉంటారని విపక్షాలు చెబుతున్నాయి. తాజాగా, శనివారం ఒక్కరోజే తెలంగాణలో ఆరుగురు ఆత్మహత్య చేసుకున్నారు.
పెరిగిన అప్పుల బాధలు, వర్షాభావంతో ఎదగని పంటలు చూసి మనస్తాపంతో రైతన్నలు తనువు చాలిస్తున్నారు. వారిలో నలుగురు ఆత్మహత్య చేసుకోగా, ఇద్దరు గుండెపోటుతో మరణించారు. మహబూబ్‌నగర్ జిల్లాలో శనివారం ఒకేరోజు ముగ్గురు రైతులు మృతి చెందారు.
వీరిలో ఒక మహిళా రైతు కూడా ఉన్నారు. ధరూరు మండలం దోనూరుకు చెందిన దుబ్బన్న(31) తనకున్న రెండెకరాలలో సాగు చేసిన పంటలు పండకపోవడంతో విసిగి ఈసారి కౌలుకు ఇచ్చాడు. వర్షాభావ పరిస్థితులతో బోర్లు వట్టిపోవడంతో కౌలు కూడా వచ్చే పరిస్థితి లేదని శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
ఖిల్లా గణపురం మండలం అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జోగు సవారమ్మ(42) పదెకరాలలో పత్తి, వరి సాగు చేసింది. కానీ పంట చేతికొచ్చే పరిస్థితి లేదు. అప్పులేమో రూ.8లక్షల వరకు పేరుకుపోయాయి. దీంతో శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
మానవపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన దేవరాజు(45) నాలుగెకరాల సొంత పొలంతోపాటు మూడెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. రెండేళ్లుగా పంటలు లేక రూ.లక్ష వరకు అప్పులు పేరుకుపోయాయి. దీంతో కలత చెందిన దేవరాజు శనివారం సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చి పంట మొత్తం పోయిందని అంటూనే గుండె వద్ద పట్టుకుని నొప్పి అంటూ మృతి చెందాడు.
అప్పుల బాధతో వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీకి చెందిన శ్రీను(44) శనివారం ఉరేసుకున్నాడు. మూడేళ్లుగా పంటలు సరిగా పండక, కుమార్తె వివాహానికి చేసిన అప్పులు మొత్తం రూ.2.50లక్షలకు చేరుకున్నాయి.
కరీంనగర్ జిల్లాలో అప్పుల బాధలతో ఒక రైతు ఆత్మహత్య చేసుకోగా, మరో రైతు గుండెపోటుతో మృతి చెందారు. కమలాపూర్ మండలం గూడూర్‌కు చెందిన నరిగె రవి(35) మూడెకరాలతో పాటు తన సోదరుడికి చెందిన మరో రెండెకరాల భూమిలో సాగు చేస్తున్నారు.
సాగు కోసం రూ.2లక్షలు ఖర్చు చేసి బావి తవ్వాడు. నీళ్లు పడకపోవడంతో మరో రూ.లక్ష ఖర్చు చేసి బోరు వేయించాడు. అందులో నీరు పడలేదు. నీరు లేక రూ.లక్ష వరకు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట ఎండిపోయే పరిస్థితి రావడంతో కలత చెంది బావి వద్దకు వెళ్లి పురుగు మందు తాగాడు.
చికిత్స కోసం ఎంజీఎంకు తరలించగా అక్కడ మృతి చెందాడు. కమాన్‌పూర్ మండలం గుండారంలోని నివసించే కౌలు రైతు రాజయ్య(42) గుండెపోటుతో మృతి చెందాడు.
పెద్దపల్లిలోని తెనుగువాడకు చెందిన వేల్పుల రాజయ్య ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా గుండారంలో ఉంటున్నాడు. ఇటీవల నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకొని పత్తి పంట వేశాడు. కానీ ఎండిపోయింది. అప్పులు రూ.3లక్షల వరకు అయ్యాయి. శనివారం మధ్యాహ్నం పత్తి చేనుకు వెళ్లిన రాజయ్య పంటను చూసి గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు.












Click it and Unblock the Notifications