పెళ్లిపై మాట్లాడుదామని పిలిచి రెండో భార్యతో కలిసి కూతురి హత్య
కరీంనగర్: పెళ్లి చేసేందుకు వరకట్నం ఇవ్వాల్సి వస్తుందని భావించి, వివాహం గురించి మాట్లాడుదామని పిలిచి కన్నతండ్రే తన రెండవ భార్య, ఆమె తమ్ముని సాయంతో కన్న కూతురును పథకం ప్రకారం హతమార్చినట్లు కరీంనగర్ జిల్లా జగిత్యాల డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ధర్మపురి సిఐ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ మాట్లాడారు.
ధర్మపురి సర్కిల్‌లోని గొల్లపెల్లి మండలం వెనుగుమట్ల గ్రామానికి చెందిన పాట్కూరి సత్యనారాయణ రెడ్డి 25ఏళ్ళ క్రితం ప్రేమలతను వివాహమాడగా, కూతురు మౌనశ్రీ జన్మించిన మూడేళ్ళకే భార్యాభర్తలకువిడాకులైనాయి. మౌనశ్రీ తల్లితో ఉండాలని, ఆమె పెళ్ళి ఖర్చులు తండ్రి భరించాలని నిర్ణయం జరిగింది. మౌనశ్రీ, ప్రేమలతలు కరీంనగర్‌లో ఉంటున్నారు. అయితే సత్యనారాయణ రెడ్డి లతను రెండవ వివాహం చేసుకున్నాడు.

ఇదిలావుంటే, మౌనశ్రీకు తండ్రి పెళ్ళి చేయాల్సి ఉండడంతో సంబంధాలు చూస్తున్నాడు. ఈ మధ్య హైదరాబాద్ సంబంధం రావడం 25లక్షలు కట్నం కావాలనడం జరగగా, పెళ్ళి విషయం మాట్లాడుదామని మౌనశ్రీని ఈనెల 8న సాయంత్రం వెనుగుమట్లకు సత్యనారాయణ రెడ్డి పిలిపించి, రాత్రి 9గంటలకు చాయ్‌లో నిద్రమాత్రలు కలిపి తాగించాడు.
అర్ధరాత్రి దాటాక బెడ్‌రూంలో నిద్రిస్తున్న మౌనశ్రీ వద్దకు తండ్రి సత్యనారాయణ రెడ్డి, సవతి తల్లి లత, ఆమె సోదరుడు రాజు వెళ్ళి, పథకం ప్రకారం ముగ్గురు కలిసి ఊపిరాడకుండా చేసి, హతమార్చారు. లక్షలాది రూపాయలు దక్కుతాయని దురుద్దేశంతో హతమార్చిన సంఘటనలో నిందితులైన సత్యనారాయణ రెడ్డి, లత, రాజులను అరెస్టు చేసి, రిమాండుకు తరలిస్తున్నట్లు డిఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వివరించారు. దర్మపురి సిఐ వెంకట రమణ, గొల్లపెల్లి ఎఎస్‌ఐ గురువారెడ్డి తదితరులున్నారు.












Click it and Unblock the Notifications