దారుణం: నిద్రిస్తున్న కూతుళ్లపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తండ్రి
హైదరాబాద్: ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. నిద్రిస్తున్న ఇద్దరు కూతుళ్లపై ఓ తండ్రి కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆనంతరం తాను కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం పట్టణంలోని వికలాంగుల కాలనీలో చోటుచేసుకుంది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. వికలాంగుల కాలనీలో నివాసముంటున్న అన్వర్ పాషా(35) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నల్గొండ జిల్లా కోదాడకు చెందిన అమ్మాయిలో అతనికి వివాహమైంది. వీరికి రహీమా(6), రేష్మ(11) ఇద్దరు కుమార్తెలు.

తాగుడుకి బానిసైన అన్వర్ నిరంతం భార్యను వేధిస్తున్నాడు. ఇటీవలే బక్రీదు పండుగ రోజున కూడా తన భార్యను కొట్టడంతో ఆమె పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత రెండు రోజుల తర్వాత ఇంటికి వచ్చిన భార్య ఈ గొడవ గురించి ఖమ్మంలోనే ఉంటున్న తన అక్క ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దీంతో పోలీసులు అన్వర్‌కు సర్ధిచెప్పేందుకు ఇంటికి వచ్చారు. పోలీసులు తన ఇంటికి వచ్చారని తెలుసుకున్న అన్వర్ ఇంట్లోకి వెళ్లి గడియపెట్టుకుని నిద్రిస్తున్న తన ఇద్దరు కుమార్తెలపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అనంతరం తాను కూడా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.
వెంటనే స్థానికులు ఇంటి తలుపులు పగులకొట్టి సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో తండ్రి అన్వర్‌పాషా(35), కుమార్తె రహీమా(6) మృతిచెందగా మరో కుమార్తె రేష్మ(11) తీవ్ర గాయాలపాలైంది. చికిత్స పొందుతున్న మరో కుమార్తె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ కలహాలే తండ్రి ఈ దారుణానికి పాల్పడటానికి గల కారణంగా పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు.












Click it and Unblock the Notifications