తల్లికి నిద్రమాత్రలిచ్చి కూతురిపై రెండేళ్లుగా తండ్రి అత్యాచారం; బయటకు వచ్చిందిలా!!
సమాజంలో రోజు రోజుకి మానవ సంబంధాలు పతనావస్థకు చేరుకుంటున్నాయి. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రులు కామాంధులుగా మారి పశువుల్లా కన్నబిడ్డల జీవితాలను ఛిద్రం చేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. తాజాగా అటువంటి దారుణ ఘటన కాప్రాలో వెలుగులోకి వచ్చింది.

కన్నతండ్రి కాదు కామాంధుడు.. షీ టీమ్స్ దృష్టికి బాలిక
మేడ్చల్ జిల్లా కాప్రాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షీ టీమ్స్ పోలీసులు లైంగిక వేధింపులకు సంబంధించి గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్, హ్యూమన్ ట్రాఫికింగ్ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమం తర్వాత ఓ విద్యార్థిని తనపై జరుగుతున్న దారుణాన్ని షీ టీమ్స్ దృష్టికి తీసుకు వెళ్ళింది. విద్యార్థిని చెప్పిన విషయాన్ని విన్న షీ టీమ్స్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. మైనర్ బాలికపై సాక్షాత్తు కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తీరు తెలుసుకున్న వారు బాలికకు అండగా నిలిచారు.

తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి కూతురిపై తండ్రి లైంగిక దాడి
గత కొన్ని సంవత్సరాలుగా సదరు మైనర్ బాలిక తల్లి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతూ ఉంది. దీంతో తండ్రి ఆమెకు నిద్ర మాత్రలు ఇచ్చి, తల్లి నిద్రలోకి జారుకున్న తర్వాత కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రెండేళ్లుగా తండ్రి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా ఆ బాలిక ఎవరికీ చెప్పుకోలేక పోతుంది. ఎవరికీ చెప్పొద్దని తండ్రి బెదిరించేవాడని బాలిక చివరకు షీ టీమ్స్ పోలీసులకు చెప్పింది. దీంతో బాలిక చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు తండ్రి ప్రశాంత్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

మరో మైనర్ బాలికపై ట్యూషన్ మాస్టారి లైంగిక వేధింపులు
ఇదిలా ఉంటే మరో ఘటనలో ఒక ట్యూషన్ మాస్టారు లైంగిక వేధింపులు వెలుగులోకి వచ్చాయి. ఎల్బీనగర్ లో నివాసముండే ఒక బాలిక పదో తరగతి చదువుతోంది అదే ప్రాంతానికి చెందిన మాచవరం వెంకట శ్రీకాంత్ కుమార్ అనే ఒక ట్యూషన్ మాస్టర్ వద్దకు ఆమె ట్యూషన్ కి వెళ్ళేది. ఈ క్రమంలో సదరు మాస్టారు బాలికతో సన్నిహితంగా ఉంటూ ఆమె ఫోన్ నెంబర్ తీసుకుని అసభ్యకర మెసేజ్లు పంపుతూ, ప్రేమించాలని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తున్నాడు. ఈ క్రమంలో బాలిక బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాలికలకు రక్షణ కరువు
బయటకు వెళితే స్కూల్లో మాస్టారు దగ్గర్నుండి, కలిసి చదువుకునే తోటి విద్యార్థులు, ప్రేమిస్తున్నానని వెంటపడేవారు, ఇలా బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. ఇంటికి వస్తే ఇంట్లో అయినా రక్షణ దొరుకుతుంది అంటే కుటుంబ సభ్యులే బాలికలను కాటు వేస్తున్న పరిస్థితి ఆందోళన కలిగిస్తుంది. బాలికల రక్షణ కోసం ఎన్ని కఠినమైన చట్టాలు తీసుకువచ్చినా ఈ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు లేదు.
బాలికలపై లైంగిక దాడులకు పాల్పడుతున్న వారికి కఠిన శిక్షలు విధిస్తున్నా భయపడుతున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఈ క్రమంలోనే ప్రస్తుతం సామాజిక పోకడలు ఆందోళనకరంగా మారుతున్నాయి. అఘాయిత్యాలు నిత్యకృత్యం అవుతున్న పరిస్థితులు దీనికి పరిష్కార మార్గాన్ని అన్వేషించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications