రియాక్టర్ పేలుడుతో రెండు పరిశ్రమల్లో భారీ అగ్ని ప్రమాదం: నలుగురు కార్మికులకు గాయాలు
సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం పాశమైలారంలోని రెండు పరిశ్రమల్లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సీఎంఎస్ పరిశ్రమలో రియాక్టర్ పేలడంతో సమీపంలో ఉన్న వనమాలి పరిశ్రమలోకి మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ప్రమాద స్తలికి చేరుకున్నారు. ఐదు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ప్రమాద సమయంలో పరిశ్రమలో 11 మంది కార్మికులకు ఉన్నట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇద్దరి ప్రాణం తీసిన మూఢనమ్మకాలు
ఓ వైపు అంతరిక్ష ప్రయోగాలతో దూసుకెళ్తుంటే.. మరోవైపు మూఢ నమ్మకాలతో సాటి మనుషుల ప్రాణాలు తీస్తున్న ఘటనలు మాత్రం తగ్గడం లేదు. మూఢ నమ్మకాల కారణంగా మహబూబాబాద్ జిల్లాలో తాజాగా చోటుచేసుకున్న ఓ అమానుష ఘటన రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఓ వ్యక్తి తల్లి బిడ్డను నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఈ ఘటన చోటు చేసుకుంది.
గత కొద్ది సంవత్సరాలుగా రెండు కుటుంబాల మధ్య మంత్రాల నెపంతో ఘర్షణలు జరుగుతున్నాయి. ఇరు కుటుంబాల మధ్య రాజీ కోసం గూడూరు పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పంచాయతీ ఫిబ్రవరి నెల 15వ తేదీకి వాయిదా పడటంతో ఆటోలో తల్లీ సమ్మక్క, కుమారుడు సమ్మయ్య తిరిగి ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆటోను అడ్డగించి కుమారస్వామి అనే వ్యక్తి వారిని నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. ఈ క్రమంలో స్థానికులు నిందితుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications