Transgender Clinics : దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్
దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లు ఏర్పాటయ్యాయి. నగరంలోని నారాయణగూడలో ఈ ఏడాది జనవరి 29న తొలి క్లినిక్ ఏర్పాటవగా జులై 11న జీడిమెట్లలో మరో క్లినిక్ ఏర్పాటైంది. ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ యాక్ట్ 2019 ప్రకారం మెట్రో నగరాల్లో ట్రాన్స్‌జెండర్స్ కోసం ప్రత్యేక క్లినిక్స్ ఉండాలన్న నిబంధన మేరకు వీటిని ఏర్పాటు చేశారు. దేశంలోని మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోని ట్రాన్స్‌జెండర్లలో ఎక్కువమంది హెచ్ఐవీ బారినపడినవారు ఉండటంతో... మొట్టమొదటగా ఇక్కడే ఆ క్లినిక్‌లను ప్రారంభించారు.
ట్రాన్స్‌జెండర్స్ యాక్టివిస్ట్ ముద్రబోయిన రచన మాట్లాడుతూ... హైదరాబాద్ ట్రాన్స్‌జెండర్లలో హెచ్ఐవీ సగటు 6.47శాతం ఉండగా జాతీయ స్థాయిలో అది కేవలం 3.13గా ఉందన్నారు. యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్స్(USAID)లో భారత్ భాగస్వామిగా ఉందని... 2030 నాటికి ఎయిడ్స్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్(NACO)తో కలిసి పనిచేస్తోందని తెలిపారు.

హైదరాబాద్‌లోని ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీకి ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌ల ద్వారా హెచ్ఐవీ నిరోధక,యాంటీరెట్రోవైరల్ థెరపీలకు సంబంధించిన వైద్య సేవలు అందుతాయని ముద్రబోయిన తెలిపారు. అలాగే వారి సామాజిక,ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే చర్యలు కూడా వీటి ద్వారా జరుగుతాయన్నారు. ఈ క్లినిక్స్ కేవలం ట్రాన్స్‌జెండర్స్‌కు మాత్రమే పరిమితం కాదని... హిజ్రాలు,ట్రాన్స్‌మెన్,క్రాస్ డ్రెస్సర్స్,లింగనిర్ధారణకాని వారికి,శివసత్తులు,జోగినీలకు వైద్య సేవలందిస్తాయని తెలిపారు.
Recommended Video

ఈ క్లినిక్స్‌లో అందించే వైద్య సేవలను ప్రమోట్ చేసేందుకు కొంతమంది ట్రాన్స్‌జెండర్,హిజ్రా నాయకులను అంబాసిడర్‌లుగా వినియోగించుకుంటున్నట్లు చెప్పారు. ఈ క్లినిక్స్ పూర్తిగా ట్రాన్స్‌జెండర్స్ ప్రతినిధులతోనే నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎంబీబీఎస్ వైద్యులు,ట్రాన్స్‌జెండర్స్ అయిన డా.ప్రాచీ,డా.రుత్ హైదరాబాద్‌లోని ట్రాన్స్‌జెండర్ క్లినిక్స్‌లో సేవలందిస్తారని తెలిపారు. హెచ్ఐవి/ఎస్‌టీఐ కౌన్సెలింగ్,లైంగిక వ్యాధుల నిరోధకత,చికిత్సలు తదితర వైద్య సేవలు వీటి ద్వారా అందుబాటులో ఉంటాయని చెప్పారు.












Click it and Unblock the Notifications