కాళేశ్వరం రచ్చ మధ్య ఐదు బిల్లుల ఆమోదం.. శాసనసభ, శాసనమండలి నిరవధిక వాయిదా!
తెలంగాణా రాష్ట్ర శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ కమీషన్ నివేదికపై జరిగిన చర్చతో రగడ కొనసాగగా తెలంగాణా శాసనసభ కీలక నిర్ణయంతో సభ నిరవధిక వాయిదా పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై జస్టిస్ PC ఘోష్ విచారణ సంఘం నివేదికపై అర్ధరాత్రి దాటేంత వరకు, 10గంటల పాటు జరిగిన చర్చకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం ఇస్తూ, ఈ విషయాన్ని CBIవిచారణకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రకటించారు.
మూడు రోజుల సమావేశాలలో 5 బిల్లుల ఆమోదం
మూడు రోజులు జరిగిన సమావేశాల్లో సభ 5బిల్లులు ఆమోదించింది.రాష్ట్రంలో మునిసిపాలిటీలు, పంచాయితీలలో BCలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే విషయమై ప్రస్తుతం ఉన్న గరిష్ట పరిమితిని ఎత్తివేసెందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులను శాసనమండలి మూజువాణీ ఓటుతో ఆమోదించింది. శాసనసభ ఈ బిల్లులను నిన్న ఆమోదించిన విషయం తెల్సిందే.కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను CBIకి అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై BRSసభ్యుల ఆందోళన మధ్య ఎలాంటి చర్చ లేకుండానే శాసనమండలి ఐదు బిల్లులను ఆమోదించింది.

ఆమోదించిన బిల్లులు ఇవే
2025 తెలంగాణ మున్సిపాలిటీస్ (రెండో సవరణ) బిల్లు, తెలంగాణ మున్సిపాలిటీస్ (మూడో సవరణ) బిల్లు, 2025 తెలంగాణ పంచాయతీ రాజ్ (రెండో సవరణ) బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ (మూడో సవరణ) బిల్లు, 2025 తెలంగాణ అల్లోపతిక్ ప్రైవేట్ మెడికల్ కేర్ ఎస్టాబ్లిష్మెంట్స్ రిజిస్ట్రేషన్, రెగ్యులేషన్ బిల్లు మండలి ఆమోదం పొందాయి.
శాసనమండలిలోనూ కాళేశ్వరం రచ్చ .. బీఆర్ఎస్ నిరసన
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై CBI విచారణ విషయమై ప్రతిపక్ష BRS సభ్యులు శాసన మండలిలో నిరసన వ్యక్తం చేశారు. ఉదయం మండలి సమావేశం అవుతూనే, BRS సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు దూసుకువెళ్ళి నిరసన వ్యక్తం చేశారు. నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
గందరగోళం మధ్యనే బిల్లుల ఆమోదం.. శాసనమండలి నిరవధిక వాయిదా
దీంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గందరగోళం మధ్యనే ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బిల్లులను చర్చకు చేపట్టారు. ఒక దశలో మార్షల్స్ మండలి హాలులోకి ప్రవేశించి, ఆందోళన చేస్తున్న BRS సభ్యులను అడ్డుకోవాల్సి వచ్చింది. బిల్లుల ఆమోదం అనంతరం శాసనమండలి నిరవధికంగా వాయిదా పడింది.












Click it and Unblock the Notifications