Telangana Secretariat: సీఎం ఛాంబర్ దగ్గర కూలిన పార్టిషన్
నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పీఓపీ పార్టిషన్ స్వల్పంగా కూలడం చర్చనీయాంశంగా మారింది. సెక్రటేరియట్ ఆరో అంతస్తులో పైనుంచి పీవోపీ పెచ్చులు స్వల్పంగా కిందకు పడ్డాయి. ముఖ్యమంత్రి చాంబర్ అంతస్తు మెయిన్ ఎంట్రన్స్ దగ్గర పీవోపీ పార్టిషన్ కూలింది.
కాగా, పీవోపీ పెచ్చులు కూలడంపై అధికారులు, సెక్యూరిటీ అప్రమత్తమైంది. అక్కడ్నుంచి అందరినీ దూరంగా పంపించారు. కాగా, కూలిన పైపెచ్చులు రామగుండం మార్కెట్ కమిటీ ఛైర్మన్ కారుపై పడ్డాయి. ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. కారు మాత్రం దెబ్బతింది.

అయితే, ఇటీవలే నిర్మించిన తెలంగాణ సచివాలయం పీవోపీ కూలడంపై కలకలం రేపుతోంది. నిర్మాణ లోపాలు ఉన్నాయా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. గతంలో వర్షాకాలంలో కూడా సచివాలయంలోని కొన్ని ప్రాంతాల్లోకి వర్షపు నీరు రావడం విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి పెచ్చులు కూలడం చర్చకు దారితీసింది.
కాగా, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణ నూతన సచివాలయాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. పాత నిర్మాణాన్ని కూల్చేసి ప్రతిష్టాత్మకంగా నూతన భవనాన్ని నిర్మించారు. అయితే, నూతన సెక్రటేరియట్ భవన నిర్మాణం ప్రారంభం తర్వాత కొంత కాలానికే అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ పార్టీ ఓటమిపాలైంది. దీంతో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ సచివాలయాన్నే ఉపయోగిస్తోంది.












Click it and Unblock the Notifications