‘అవసరమైతే తప్ప బయటికి రావద్దు..’: హైదరాబాద్ లో ప్రజలకు అధికారుల హెచ్చరిక
ఉరుములు.. మెరుపులు.. ఏకథాటిగా ఒకటే వాన. హైదరాబాద్‌ను సోమవారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో దంచికొట్టింది. కుండపోత వానకు నగరం తడిసి ముద్దయింది. మూడు గంటలు వర్షం ఆగకుండా కురిసింది.
హైదరాబాద్ : ఉరుములు.. మెరుపులు.. ఏకథాటిగా ఒకటే వాన. హైదరాబాద్‌ను సోమవారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో దంచికొట్టింది. కుండపోత వానకు నగరం తడిసి ముద్దయింది. దాదాపు మూడు గంటలపాటు వర్షం ఆపకుండా కురిసింది.
దీంతో నగరంలోని కీలక ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భారీ వర్షానికి భయపడిన ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు రావడం లేదు. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలకు వర్షపు నీరు చేరుకుంటుంది.

రోడ్లపై మోకాళ్లలోతు నీరు...
మరోవైపు ఉన్నట్లుండి కురిసిన వర్షం వల్ల నగరంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. రహదారులపై వాహనదారులు ముందుకు కదల్లేని పరిస్థితి నెలకొంది. రోడ్ల మీద కూడా మోకాళ్లలోతు నీరు నిలిచిపోయింది. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వర్షం ప్రారంభం కావడంతో చాలా మంది ఆఫీసుల్లోనే ఉండిపోయారు. పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడినట్లు తెలుస్తోంది. నగరంలోని చిన్న చిన్న నాలాలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి.
Recommended Video


మరో 48 గంటల పాటు...
చార్మినార్, యాకుత్‌పురా, డబీర్‌పురా, ఉప్పుగూడ, సంతోష్‌నగర్, చాంద్రాయణగుట్ట, పురానాపూల్, జియగూడ, మెహిదీపట్నం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సోమాజిగూడ, యూసుఫ్‌గూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, కోఠి, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, హయత్‌నగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, ఈసీఐఎల్‌లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఉప్పల్, మల్కాజ్‌గిరీ ఏరియాల్లో భారీ స్థాయిలో వర్షం నమోదు అయ్యింది. మరో 48 గంటల పాటు హైదరాబాద్‌లో వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ చెబుతోంది.

ఆ మార్గాల్లో వెళ్లే వారు.. జాగ్రత్త..
రాణిగంజ్ బాంబే హోటల్, వోల్గా హోటల్ దరుసలామ్, మలక్‌పేట పోలీస్ స్టేషన్, కర్బాలా మైదాన్ జంక్షన్, బషీర్‌బాగ్ బహార్ కేఫ్ హోటల్, మెడిసిటీ హాస్పటల్, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, హిమాయత్‌నగర్ స్ట్రీట్ నెంబర్ 19, స్ట్రీట్ నెంబర్ 5, మలక్‌పేట్ గంజ్, మలక్‌పేట బజాబ్ ఎలక్ట్రికల్, బీవీబీ జంక్షన్, సీఎం క్యాంప్ ఆఫీస్, లేక్ వ్యూ గెస్ట్ హౌజ్, క్రోమా, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45, పుత్లిబౌలి, కేసీపీ జంక్షన్, కేసీపీ జంక్షన్, పంజాగుట్ట జంక్షన్, గుల్జార్ హౌస్ ప్రాంతాల్లో భారీ స్థాయిలో నీరు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఈ మార్గాల్లో వెళ్లే ప్రయాణికులు జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

‘అన్ని జాగ్రత్తలూ తీసుకోండి..’
నగరంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో అధికారులు, పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. జంట నగరాల ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. వర్షం పూర్తిగా నిలిచిన తర్వాతే ఉద్యోగస్తులు తమ కార్యాలయాల నుంచి తమ నివాసాలకు వెళ్లాలని సూచించారు. నాలాల వైపు వాహనదారులు వెళ్లొద్దని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు, పాదాచారులు చాలా జాగ్రత్తగా వెళ్లాలని, నగర పోలీసులకు సహకరించాలని పోలీసు యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.












Click it and Unblock the Notifications