Eshwar Sai: నన్ను శారీరంగా వాడుకుని మోసం చేసి పారిపోయాడు
తెలంగాణ జానపద పాటలు, డాన్స్ షోలతో విపరీతమైన ప్రజాదరణ పొందిన 'బాసింగ బలాలు' ఫేమ్, ప్రముఖ ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి చట్టపరమైన చిక్కుల్లో పడ్డాడు. వెండితెర, బుల్లితెరపై తన స్టెప్పులతో గుర్తింపు తెచ్చుకున్న అతడి అసలు స్వరూపం బయటపడటంతో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా వాడుకొని, తీరా సమయం వచ్చేసరికి ముఖం చాటేసి మోసం చేశాడంటూ అతడితో పాటు డాన్స్ చేసే తోటి కళాకారిణి మాధురి రాథోడ్ పోలీసులను ఆశ్రయించింది.
బాధితురాలు మాధురి రాథోడ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీరిద్దరి మధ్య జానపద పాటల షూటింగ్‌లు, సోషల్ మీడియా రీల్స్ చేసే క్రమంలో పరిచయం ఏర్పడింది. 'బాసింగ బలాలు' పాటతో పాటు మరికొన్ని ప్రాజెక్టులలో ఇద్దరూ కలిసి నటించడంతో ఆ పరిచయం కాస్తా చొరవగా మారింది. ఆ తర్వాత మాధురిపై ప్రేమ పేరిట వల విసిరిన ఈశ్వర్ సాయి, ఆమెను పెళ్లి చేసుకుంటానని బలంగా నమ్మించాడు. అతడి మాటలను నిజమని నమ్మిన మాధురి, అతడితో సహజీవనానికి సైతం అంగీకరించింది.

సహజీవనం.. ఆపై బెదిరింపులు!
పెళ్లి చేసుకుంటాననే నెపంతో ఈశ్వర్ సాయి ఆమెను పలుమార్లు శారీరకంగా వాడుకున్నాడు. అయితే, కొంతకాలంగా పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా తప్పించు తిరగడం ప్రారంభించాడు. అనుమానం వచ్చి గట్టిగా నిలదీయగా.. పెళ్లి చేసుకునేది లేదని తెగేసి చెప్పడమే కాకుండా, ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, కెరీర్ నాశనం చేస్తానని బెదిరింపులకు దిగాడు. దీంతో మోసపోయానని గ్రహించిన మాధురి రాథోడ్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఈశ్వర్ సాయిపై అధికారికంగా ఫిర్యాదు చేసింది.
పోలీసుల కేసు నమోదు.. నిందితుడి కోసం గాలింపు!
బాధితురాలి ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఈశ్వర్ సాయిపై సెక్సువల్ అబ్యూస్, మోసం, బెదిరింపుల కింద కేసు నమోదు చేశారు. పోలీసుల విచారణ ముమ్మరం కావడంతో విషయం తెలుసుకున్న ఈశ్వర్ సాయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పరారయ్యాడు. ప్రస్తుతం అతడి ఆచూకీ కోసం నార్సింగి పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. నగరంలోని అతడి నివాసంతో పాటు, సంభాషణలు సాగించిన ప్రాంతాలు, స్నేహితుల ఇళ్లలో జల్లెడ పడుతున్నారు. ఈ ఘటన జానపద కళాకారుల వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడలోని రెడ్డి భవన్‌లో ఓ రూమ్‌లో వీరిద్దరూ ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య అక్కడికి చేరుకుంది. తన భర్త మరో మహిళతో కలసి ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి వచ్చిన శరణ్య.. వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి.. తన భార్య శరణ్యకు దొరికిపోయిన తర్వాత తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన భర్తను లోబరుచుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ శరణ్య.. మాధురి రాథోడ్‌పై దాడి చేసి, అసభ్యకర పదజాలంతో దూషించిందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్రంగా స్పందించిన మాధురి రాథోడ్, వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో శరణ్యపై ఫిర్యాదు చేసింది. అయితే ఆ సమయంలో తన భర్త చాలా మంచివాడని, మాధురి వల్లే ఈ పరిస్థితి వచ్చిందని శరణ్య వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.














Click it and Unblock the Notifications