గురుకులాల్లో ‘ఫుడ్ పాయిజన్’పై సర్కారు కీలక నిర్ణయం: రేవంత్ వార్నింగ్
ఇటీవల గురుకులాల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కేసులకు సంబంధించి కారణాలు తేల్చేందుకు ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. ఫుడ్ సేఫ్టీ కమిషనర్, అదనపు డైరెక్టర్, జిల్లా స్థాయి అధికారితో కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గురుకులాలు, హాస్టళ్లు, అంగన్‌వాడీలు, ఆస్పత్రుల్లో ఆహార నాణ్యతను టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షించనుంది. ఫుడ్ పాయిజన్ జరిగినప్పుడు కారణాలు తేల్చి, బాధ్యులను గుర్తించనుంది ఈ టాస్క్‌ఫోర్స్. ఇక, పాఠశాల ఫుడ్ సేఫ్టీ కమిటీలో హెడ్ మాస్టర్, ఇద్దరు పాఠశాల సిబ్బంది ఉంటారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వంట చేసే ముందు కిచెన్ పరిశీలించి పరిశుభ్రత నిర్ధారించాలి, ఫుడ్ సేఫ్టీ కమిటీ రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు ఆహారం వడ్డించాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
కాగా, పాఠశాలల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై హైకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. విద్యార్థుల ప్రాణాలు పోతేగానీ స్పందించరా? అని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సర్కారు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
సొంతబిడ్డల్లా చూడాలి: సీఎం రేవంత్ ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులను సొంత బిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించే విషయంలో ఎటువంటి అలక్ష్యానికి తావు ఇయ్యరాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు.
బడి పిల్లలకు అందించే ఆహారానికి సంబంధించి ఘటనలు పునరావృతం కావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.
కలెక్టర్లు తరచూ పాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాలను తనిఖీ చేసి, నివేదికలను సమర్పించాల్సిందే అని ఆదేశించారు. గడిచిన పదేళ్లలో గాడితప్పిన విద్యా వ్యవస్థను తిరిగి దారిలో పెట్టే క్రమంలో ప్రస్తుత ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ పునరుద్ఘాటించారు.
విద్యార్థినీ విద్యార్థుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కొందరు దురుద్దేశంతో ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, లేనివి ప్రచారం చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారని, అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ అధికారులను ఆదేశించారు.












Click it and Unblock the Notifications