ఇండిక్యాష్ విచిత్రం: రూ.5 వేలు డ్రా చేస్తే.. 50 వేలు వచ్చాయి!
హైదరాబాద్: బ్యాంకు ఏటీఎంలో కార్డు పెట్టి ఎంత డబ్బు అవసరమో వివరాలను నమోదు చేస్తే అంతే మొత్తంలో నగదు రావడం సాధారణంగా మనం చూశాం. కానీ వెయ్యి రూపాయలు డ్రా చేసిన వారికి రూ. 5 వేలు వచ్చాయి. ఇదేదో పండుగ ఆఫర్ కాదు, లేదా లక్కీ లాటరీ అంతకన్నా కాదు.
ఓ ఏటీఎంలో నగదు డ్రా చేయడానికి వెళ్లిన ఖాతాదారులకు ఎదురైన వింత అనుభవం. శుక్రవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని ఏర్పాటు చేసిన ఇండిక్యాష్ ఏటీఎంలో ఈ వింత ఘటన చోటు చేసుకుంది.
రూ. 500 డబ్బులు డ్రా చేయడానికి యత్నించగా రూ. 2 వేలు, రూ. వేయికి బదులుగా రూ. 4వేలు, రూ.4 వేలకు బదులుగా రూ. 16 వేలు బయటకు వచ్చాయి. అదే రూ.5 వేలు డ్రా చేస్తే 50 వేలు వచ్చాయి.

ఇలా డ్రా చేసిన దానికంటే అధికమొత్తంలో నగదు వచ్చిందని స్థానికులు పేర్కొన్నారు. ఇంకేముంది ఈ ఏటీఎం ముందు ప్రజలు బారులు తీరారు. ఇలా ఐదారు మందికి పైగా నగదు డ్రా చేసిన తర్వాత ఏటీఎంలో డబ్బు అయిపోవడంతో పలువురు నిరాశగా వెనుదిరిగారు.
కాగా, ఏటీఎం విషయం తెలిసి ఎక్కడెక్కడి నుంచో ఖాతాదారులు పరుగెత్తుకు రాగా.... ఏటీఎం నిర్వాహకులు మాత్రం సాయంత్రం వరకు రాకపోవడం గమనార్హం. ఈ విషయమై కందకూరు సీఐ విజయ్ కుమార్‌ను వివరణ కోరగా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని ఆయన పేర్కొన్నారు.
ఎవరైతే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేశారో వారి వద్ద నుంచి బ్యాంకు వర్గాలు నగదుని వసూలు చేస్తారని ఆయన తెలిపారు. ఏటీఎంలో నగదును నిల్వ చేసే క్రమంలో ఏర్పడిన తప్పిదం వల్లే ఇలా జరిగిందని ఇండిక్యాష్ ప్రతినిధి చెప్పారు.












Click it and Unblock the Notifications