రేవంత్‌కు వ్యతిరేకంగా 38 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు: స్కెచ్ రెడీ: ఆ ఇద్దరు మంత్రులు
Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రాజుకుందా? లోక్‌సభ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడం వల్ల దీనికి కారణం అయిందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం ఇస్తోంది ప్రతిపక్ష భారత్ రాష్ట్ర సమితి. రేవంత్ రెడ్డి పనితీరు పట్ల అసలైన కాంగ్రెస్ నాయకులు అసంతృప్తితో ఉంటోన్నారని చెబుతోంది.
రేవంత్ రెడ్డి పట్ల సొంత పార్టీ శాసన సభ్యుల్లో ధిక్కార స్వరం పెరిగిందని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న ఉదంతమే దీనికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.

రేవంత్ రెడ్డి పనితీరు పట్ల సొంత కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లోనే సగం మందికి పైగా విశ్వాసం తగ్గిందని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సొంత ఎమ్మెల్యేలే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం మెజారిటీ శాసన సభ్యులకు ఇష్టం లేదని పేర్కొన్నారు. గెలిచిన 64 మందిలో 26 మందే రేవంత్ వైపు ఉన్నారని వ్యాఖ్యానించారరు.
మిగిలిన 38 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారని, దానికి నిదర్శనమే వరంగల్‌లో ఎదురైన సంఘటన అని ఆయన అభివర్ణించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు మాత్రమే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తోన్నారని, మిగిలిన వాళ్లపై నమ్మకం లేదా అని ప్రశ్నించారు.
కేబినెట్ సహచరుల్లో ఈ ఇద్దరు మంత్రులు మాత్రమే రేవంత్ రెడ్డి తీసుకుంటోన్న నిర్ణయాలను స్వాగతిస్తోన్నారని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. సొంత పార్టీలో ధిక్కార స్వరం పెరిగి పోయిందని, అందుకే తనకంటూ ఓ వర్గాన్ని పెంచుకోవడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పార్టీ కండువా కప్పుతోన్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, గంటకో హత్య జరుగుతోందంటూ మండిపడ్డారు.












Click it and Unblock the Notifications