మధ్యవర్తిత్వ సంస్కృతి పెరగాలి: మాజీ సీజేఐ ఎన్వీ రమణ
హైదరాబాద్: సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఏర్పాటైన ఇండియా మీడియేషన్ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఇండియా మీడియేషన్ డే తొలి వార్షికోత్సవ వేడుకలు ఇవే కావడం వల్ల పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తమ అభిప్రాయాలను తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో మాజీ సీజేఐ ఎన్వీ రమణతో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వర రావు, ఆర్వీ రవీంద్రన్, సింగపూర్ ఇంటర్నేషనల్ మీడియేషన్ సెంటర్ జార్జ్ లిమ, గ్రెగరీ విజేంద్రన్, పూర్ణిమా హట్టి, చిత్ర నారాయణ్, సీతేష్ ముఖర్జీ తదితరులు మీడియేటర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. న్యాయపరమైన సమస్యలని పరిష్కరించడంలో మధ్యవర్తిత్వం కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. మధ్యవర్తిత్వానికి ప్రాధాన్యత క్రమంగా పెరుగుతోందని వ్యాఖ్యానించారు. మీడియేషన్ వల్ల ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరిగాల్సిన ఇబ్బందులు తప్పుతాయని పేర్కొన్నారు. మధ్యవర్తిత్వం అనేది పురాణాల కాలంలో కూడా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ వివరించారు.
మహాభారత యుద్ధాన్ని నివారించడానికి పాండవులు, కౌరవుల మధ్య శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా మధ్యవర్తిత్వం నిర్వహించారని గుర్తు చేశారు. అది విఫలం వల్లే మహాభారత యుద్ధం జరిగిందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. శ్రీకృష్ణుడి రాయబారం కూడా మధ్యవర్తిత్వంలాంటిదేనని అన్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా దేశీయ న్యాయవ్యవస్థలో మధ్యవర్తిత్వ ప్రాధాన్యత పెరిగిందని చెప్పుకొచ్చారు.
మధ్యవర్తిత్వ ప్రాధాన్యత మరింత వేగంగా పెరగాల్సిన అవసరం ఉందని, అదే సమయంలో మధ్యవర్తులు కూడా విశ్వసనీయతను కాపాడుకోవాలని ఎన్వీ రమణ అన్నారు. మీడియేషన్‌లో విన్ టు విన్ అనేది ఉండాలని, ఎవరూ ఓడిపోకూడదని ఆయన చెప్పారు. న్యాయమూర్తిగా తనకు 22 సంవత్సరాల అనుభవం ఉందని, హైదరాబాద్‌లో మీడియేషన్ కేంద్రం ఏర్పాటు కోసం కృషి చేశానని వివరించారు.
న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వానికి ఎంతో ప్రాధాన్యత ఉందని, దీన్ని వినియోగించుకోవాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి అన్నారు. సత్వర న్యాయాన్ని అందించడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని, సమస్యల పరిష్కారంలో ప్రధాన పాత్ర వహిస్తుందని చెప్పారు. మధ్యవర్తిత్వ సంస్కృతి పెరగాల్సిన అవసరం ఎంతో ఉందని, దీనిపై ఇంకా చాలామందికి అవగాహన ఏర్పడాల్సిన అవసరం ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications