ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్
హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్ రావును పోలీసులు గురువారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB)లో పనిచేసిన సమయంలో డీఎస్పీ(ప్రస్తుతం సస్పెండయ్యారు) దుగ్యాల ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్ రావు టీం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలున్నాయి. గురువారం ఉదయం నుంచి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో రాధాకిషన్ రావును విచారించిన అధికారులు.. శుక్రవారం సాయంత్రం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.
అనంతరం నాంపల్లిలోని న్యాయమూర్తి నివాసంలో ప్రవేశపెట్టడంతో.. రాధాకిషన్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఐ గట్టుమల్లు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు ఆదేశాలతో పనిచేసినట్లు గుట్టుమల్లు చెప్పినట్లు సమాచారం.

కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను ఏప్రిల్ 2 వరకు ఐదు రోజుల పోలీసు కస్టడీకి తీసుకున్నారు. ఇది ఇలావుండగా, అధికారికంగా పోలీసులు ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదు చేశారు. టెలిగ్రాఫ్ చట్టాన్ని జత చేస్తూ నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశారు.
అయితే, దేశంలో అతి తక్కువ కేసుల్లోనే ఈ టెలిగ్రాఫ్ చట్టాన్ని ప్రయోగించడం గమనార్హం. ఇప్పటి వరకు అధికార దుర్వినియోగం, ప్రభుత్వానికి సంబంధించిన విలువైన సమాచారాన్ని ధ్వంసం చేసిన కేసుల్లోనే నిందితులు ప్రణీత్ రావు, తిరుపతన్న, భుజంగరావును విచారించారు. ఈ నేపథ్యంలోనే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య ఈ కేసు విషయమై మాటల తూటాలు పేలుతున్నాయి. ఫోన్ ట్యాపింగ్ చేసిన నిందితులకు జైల్లో చిప్పకూడు తప్పదంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications