కొడుకు,కోడలితో ప్రాణహాని ఉంది... బంజారాహిల్స్ పోలీసులకు మాజీ మంత్రి ఫిర్యాదు...
తన కొడుకు, కోడలితో తనకు ప్రాణహాని ఉందంటూ మాజీ మంత్రి కంతేటి సత్యనారాయణ రాజు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొడుకు కేవీఎస్ రాజు,కోడలు పార్వతి... ఆస్తులు రాసివ్వాలని తనను బెదిరిస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇద్దరి నుంచి తనకు వేధింపులు ఎక్కువయ్యాయని... వారి నుంచి ప్రాణహాని ఉన్నందునా రక్షణ కల్పించాలని కోరారు.
తన తదనంతరం ఆస్తులన్నీ కొడుక్కి చెందేలా వీలునామా రాశానని సత్యనారాయణ రాజు తెలిపారు. అయితే ఆస్తులన్నీ ఇప్పుడే తమకు రాసివ్వాలని కొడుకు కేవీఎస్ రాజు, కోడలు పార్వతి బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు.ఇటీవల తన బెడ్ రూమ్‌లో బీరువా తాళాలు పగలగొట్టి మరీ ఆస్తుల పత్రాలు తీసుకెళ్లారని ఆరోపించారు. తాడేపల్లిగూడెంలో తన అత్తగారికి చెందిన భూమిని ఆక్రమించుకునేందుకు కొడుకు,కోడలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

ఇదే విషయమై ఇటీవల సత్యనారాయణ రాజు కోర్టును ఆశ్రయించారు. కొడుకు,కోడలి నుంచి ప్రాణహాని ఉందని కోర్టులో ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమంత్రిగా పనిచేసిన కంతేటి సత్యనారాయణరాజు (75) ప్రస్తుతం హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నం.4లో నివాసముంటున్నారు. ఆయన భార్య జానకి అనారోగ్యంతో గతేడాది మార్చిలో చనిపోయారు. ఆయన కొడుకు కేవీఎస్ రాజు,కోడలు పార్వతి భీమవరంలో ఉంటున్నారు. అక్కడే వ్యాపారం నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా ఆస్తుల పంపకాల విషయంలో తండ్రీ కొడుకుల మధ్య గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయన పోలీసులను ఆశ్రయించారు. సత్యనారాయణ రాజు ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ పోలీసులు కేవీఎస్ రాజు, పార్వతిలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications