ఖమ్మంలో యూత్ టార్గెట్ గా మాజీ ఎంపీ పొంగులేటి మాస్టర్ ప్లాన్!!
ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని శరవేగంగా పావులు కదుపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా నుంచి ఒక్క బీఆర్ఎస్ నేతను కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని శపథం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వడివడిగా వేస్తున్న అడుగులు ఇప్పుడు ఖమ్మం జిల్లాలోని రాజకీయ వర్గాలను ఆలోచించేలా చేస్తున్నాయి.
ఇప్పటికే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, టి ఎస్ పి ఎస్ సి లో జరిగిన పేపర్ లీకేజ్ వ్యవహారంతో నిరుద్యోగులకు నష్టం జరిగిందని ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్న వేళ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే పనిలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.

ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈనెల 29వ తేదీన భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఖమ్మంలోని ఎస్ ఆర్ గార్డెన్స్, వెలుగుమట్లలో నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. మెగా జాబ్ మేళాలో వందకు పైగా కంపెనీలు పదివేలకు పైగా ఉద్యోగాలు ఇస్తాయని, పదవతరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు, ప్రొఫెషనల్ కోర్సుల వారికి కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఖమ్మం జిల్లాలో ఉన్న నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు.10 వేల మందికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాలని నిర్ణయించడం, వచ్చే ఎన్నికల్లో యువత మద్దతు కోసమేనని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరో ఆరు నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. 29న జరగనున్న మెగా జాబ్ మేళాలో పది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తే, నిరుద్యోగ యువత మద్దతు కచ్చితంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉంటుంది అనేది స్థానికంగా జరుగుతున్న చర్చ.












Click it and Unblock the Notifications