సంతోషం: సస్పెన్షన్ వేటుపై మాజీ ఎంపీ పొంగులేటి షాకింగ్ స్పందన
బీఆర్ఎస్ పార్టీ నుండి ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, మయీ మంత్రి జూపల్లి కృష్ణారావును సస్పెండ్ చేస్తూ వేటు వేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఇన్ని రోజులకు తనకు విముక్తి దొరికిందని ఆయన వ్యాఖ్యానించారు. దొరల గడీ నుండి విముక్తి లభించినందుకు తనకు సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
పార్టీ నుండి ఇప్పటికైనా సస్పెండ్ చేసినందుకు కేసిఆర్ కు ధన్యవాదాలు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు .పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని, జూపల్లి కృష్ణారావును బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ప్రకటన చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే నిన్న తన మద్దతుదారులతో కలిసి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కెసిఆర్ ను టార్గెట్ చేసి కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.

కుటుంబ స్వార్థానికి రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన కేసీఆర్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అవుదామని అనుకుంటున్నారని అయితే అది పగటికలేనని మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక పొంగులేటి నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం సంఘీభావం తెలిపారు. ఇద్దరు కలిసి సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితిని స్థాపించినప్పుడే కేసీఆర్ గాడి తప్పారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో అసమతి ఉందని, వచ్చే ఎన్నికలలో కేసీఆర్ గెలవడం ఈజీ కాదని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.
ఇక మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం కెసిఆర్ ను టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లో నిజాయితీ లోపించిందని, కనీసం ప్రజా ప్రతినిధులు ఫోన్ చేసినా ఆయన స్పందించే పరిస్థితి లేదని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో వేలకోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. కెసిఆర్ ప్రగతి భవన్ తలుపులు మూసేసి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ఇక దీంతోనే వీరిద్దరిపై వేటు వేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది బి ఆర్ ఎస్.












Click it and Unblock the Notifications