జీతం చాలడం లేదని నకిలీ సర్టిఫికెట్ల దందాలోకి టెక్కీ (పిక్చర్స్)
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టు చేశారు. గతంలో విప్రోలో పనిచేసిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీరుతో పాటు అతని అనుచరులను ఇద్దరిని పోలీసులు గురువారంనాడు అరెస్టు చేశారు. బిటెక్ గ్రాడ్యుయేట్ అయిన షేక్ మీరా బాషా గతంలో విప్రోలో పనిచేశాడు.
అతను నల్లగొండ జిల్లాకు చెందినవాడు. జీతంతో సంతృప్తి చెందక అతను ఉద్యోగాన్ని వదిలేశాడు. ఆ తర్వాత మరో సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరాడు. అక్కడ కూడా వేతనంతో అతను అసంతృప్తికి గురయ్యాడు. సులభంగా డబ్బులు సంపాదించడదానికి నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి, విక్రయించే పనికి పూనుకున్నాడు.

ఫొటోషాప్ నేర్చుకుని, తన మాజీ సహోద్యోగి అరవింద్ సలహా మేరకు విద్యకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసే అవసరమైనవారికి విక్రయిస్తూ వచ్చాడు. ఒక్కో అభ్యర్థి నుంచి 40 వేల నుంచి 45 వేల రూపాయలు వసూలు చేస్తూ వచ్చాడని పోలీసులు చెప్పారు.

జి. చంద్రశేఖర్ అనే వ్యక్తి ద్వారా అతను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మూడు రబ్బరు స్టాంపులను సంపాదించాడు. ఆ ఇద్దరిని పోలీసులు ఎస్ఆర్ నగర్‌లో అరెస్టు చేశారు.

రుణాలు పొందడానికి అదే రీతిలో నకిలీ విద్యార్హతల నకిలీ సర్టిఫికెట్లను తయారు చేసి, విక్రయిస్తున్న సిటి బ్యాంక్ జిఈ క్యాపిటల్ మాజీ ఏజెంట్ డి. సాయిబాబను పోలీసులు అరెస్టు చేశారు. అతను హైదరాబాదులోని మాదన్నపేటకు చెందినవాడు. రెండు కేసుల్లోనూ పోలీసులు 136 నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు.












Click it and Unblock the Notifications