ఘోర ప్రమాదం: నలుగురు మృతి, క్షతగాత్రులను తన వాహనంలో తరలించిన కేటీఆర్
నగరంలోని తిరుమలగిరి ఆర్‌టీఏ కార్యాలయం వద్ద గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్: నగరంలోని తిరుమలగిరి ఆర్‌టీఏ కార్యాలయం వద్ద గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లాలాపేటకు చెందిన ఎండీ అజార్(37), ఇమ్రానాబేగం(35) దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు ఓ కార్యక్రమానికి హాజరై... అక్కడి నుంచి ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరారు.
వారి వాహనం ఆర్‌టీఏ కార్యాలయం వద్ద మలుపు తీసుకుంటుండగా... జీహెచ్‌ఎంసీ చెత్త తరలింపు వాహనం (ఎపీ24వీ5893) వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో ఆజర్(37), అమన్(9), అశ్వియా(7), అలీనా(3) అక్కడికక్కడే చనిపోయారు. అజహర్ భార్య ఇమ్రాన్‌బేగం, మరో చిన్నారి అదియా తీవ్రంగా గాయపడ్డారు.

కాగా, అదేసమయంలో సిరిసిల్ల నుంచి హైదరాబాద్‌కు వస్తున్న మంత్రి కేటీఆర్ ప్రమాద స్థలంలో కాన్వాయ్‌ను ఆపి బాధితులకు సహాయం చేశారు. తన కాన్వాయ్‌లోని ఒక వాహనంలో క్షతగాత్రులను సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. మేయర్ బొంతు రామ్మోహన్ కూడా ఘటనా స్థలం నుంచి ఆస్పత్రికి వెళ్లారు.
మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పరిస్థితిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులను మేయర్ ఆదేశించారు. మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. టిప్పర్ డ్రైవర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వాహన డ్రైవరు మద్యం మత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు పేర్కొంటున్నారు.












Click it and Unblock the Notifications