ఫ్రెండ్లీ పోలీసింగ్?: ఇన్‌స్పెక్టర్ కుర్చీలో రౌడీషీటర్ ఫోజులు!
హైదరాబాద్: ఆయనో పోలీస్ ఇన్‌స్పెక్టర్. పని చేసేది హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో. ఏడాది క్రితం ఓ రౌడర్ షీటర్‌ను పోలీస్‌స్టేషన్‌లో అతని కూర్చీలోనే కూర్చుబెట్టి వివాదంలో చిక్కుకున్నారు. దర్జాగా కూర్చుని ఫొటోలకు పోజులిచ్చాడు ఆ నేరస్తుడు. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
కూర్చీలో చూర్చున్నది నేరస్తుడు జబ్బార్. రౌడీషీటర్ అయిన అతనిపై ఎన్నో నేరాల్లో కీలక సూత్రధారుడనే ఆరోపణలున్నాయి. అతడిపై ఎస్‌ఆర్ నగర్, జూబ్లీహిల్స్, చాంద్రా యణగుట్ట, గోల్కొండ పోలీస్‌స్టేషన్లలో ఎన్నో కేసులున్నాయి.

నేరచరిత్ర ఉన్న వ్యక్తిని పోలీసులు సహజంగా దూరంగా ఉంచుతారు. కానీ ఈ ఇన్‌స్పెక్టర్.. చనువుతో మరింత స్వేచ్ఛనిచ్చాడు. అదే అవకాశంగా రౌడీషీటర్.. ఇన్‌స్పెక్టర్ కుర్చీలో కూర్చొని పోజులిచ్చాడు. సుల్తాన్ బజార్ పోలీస్‌స్టేషన్‌లో ఏడాది క్రితం జి. శ్రీనివాస్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆయన బంధువులు జబ్బార్‌ను పరిచయం చేశారు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగి స్నేహంగా మారింది.
చాలాకాలం కలిసి తిరగటం.. ఠాణాలోనే భోజనం చేయటం వంటివి చేసేవారని సమాచారం. జబ్బార్‌కు ఇన్‌స్పెక్టర్ భుజంపై చేయి వేసేంత సాన్నిహిత్యం పెరిగిందనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. అప్పట్లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తూ గురువారం బహిర్గతమయ్యాయి.

కాగా, ప్రస్తుతం ఆ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ పోలీసు కంట్రోల్ రూమ్‌లో విధులు నిర్వహిస్తున్నారు. విషయం బయటకు పొక్కటంతో సదరు ఇన్‌స్పెక్టర్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
గతంలో జబ్బార్‌తో పరిచయం ఉన్న మాట వాస్తవ మేనని.. అతడి నేరప్రవృత్తి తెలిశాక దూరంగా ఉంచానంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను లేని సమయంలో పొటో దిగి ఉండవచ్చని.. తన ఫొటోతో మార్ఫింగ్ చేసి పరువుకు భంగం కలిగించినట్టు వివరించారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. ఈ కేసును సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications