
మంత్రి కేటీఆర్‌తో టీడీపీ ఎమ్మెల్యే గంటా భేటీ.. స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై చర్చ.. వైజాగ్ రావాలని విజ్ఞప్తి...
తెలంగాణ ఐటీ,పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను శనివారం(మార్చి 20) టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కలిశారు. హైదరాబాద్‌లోని అసెంబ్లీ ప్రాంగణంలో కేటీఆర్‌తో గంటా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమంపై చర్చించారు. ఆంధ్రుల పోరాటానికి మద్దతుగా టీఆర్ఎస్ నేతలు కూడా విశాఖపట్నం రావాలని కోరారు. గంటా విజ్ఞప్తిపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. త్వరలోనే విశాఖ పర్యటనపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అక్కడ జరుగుతున్న ఉద్యమానికి మంత్రి కేటీఆర్ ఇదివరకే మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్రం వైఖరిని ఇలాగే ఉపేక్షిస్తే.. రేపు తమదాకా వస్తుందని ఇటీవల ఆయన పేర్కొన్నారు. అదే జరిగితే తెలంగాణలోని బీహెచ్ఈఎల్,సింగరేణి వంటి కంపెనీలను కూడా కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందన్నారు. కాబట్టి ప్రైవేటీకరణ విధానానికి తాము వ్యతిరేకమని... విశాఖ ఉద్యోగుల పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. అవసరమైతే సీఎం కేసీఆర్ అనుమతితో విశాఖపట్నం వెళ్లి తమ సంఘీభావం తెలియజేస్తామన్నారు. కేటీఆర్ మద్దతును స్టీల్ ప్లాంట్ కార్మికులు స్వాగతించారు. ఆయన చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేశారు.

ఇక విశాఖ ఉక్కు కోసం జరుగుతున్న ఉద్యమంలో భాగంగా గంటా శ్రీనివాసరావు ఇప్పటికే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అది స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉంది. అయితే గంటా రాజీనామా ఒక డ్రామా అని వైసీపీ నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. గంటా మాత్రం ఎవరు డ్రామాలు ఆడుతున్నారో ప్రజలకు బాగా తెలుసునని గతంలో అభిప్రాయపడ్డారు. ఇటీవల ప్రధానిని కలిసినప్పుడు విశాఖ ఉక్కు అంశాన్ని సీఎం జగన్ ఎందుకు ప్రస్తావించలేదని ప్రశ్నించారు.

రాష్ట్ర ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్రం వెనక్కి తగ్గుతుందని గంటా అభిప్రాయపడుతున్నారు. అంతా అయిపోయిన తర్వాత ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే వైసీపీ నేతల మాటలను ఎవరూ నమ్మరని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సహకరించి చరిత్రహీనులుగా మిగలొద్దని వైసీపీ ఎంపీలకు ఆయన సూచిస్తున్నారు. తాజాగా గంటా మంత్రి కేటీఆర్‌తో భేటీ అవడంతో అధికార వైసీపీ ఈ పరిణామాన్ని ఎలా చూస్తుంది... ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రస్తుతం కార్మికుల ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే.