అన్నీ:సర్వేపై కేసీఆర్, ఆన్‌డ్యూటీ లేఖ, కాలేజీలకు షాక్
హైదరాబాద్: సమగ్ర సర్వేలో తెలంగాణ ప్రజలు ఎన్యూమరేటర్లకు అన్ని వివరాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సోమవారం చెప్పారు. మంగళవారం నాడు తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతం చేయాలని కోరారు. సర్వే చేసే అధికారులకు పూర్తి సమాచారం ఇచ్చి, పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలు అందించేందుకు సర్వే నిర్వహిస్తున్నామని, ఎవరి అవసరాలు ఏమిటో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు. అన్ని ప్రాంతాలలో ఏకకాలంలో సర్వే జరుగుతుందన్నారు. ఏ కుటుంబంలోని, ఏ వ్యక్తి, ఏం కోరుకుంటున్నాడో తెలుసుకునేందుకే ఈ సర్వే అన్నారు. పథకాలు అందించేందుకు ఈ సర్వే చేపడుతున్నట్లు చెప్పారు.

ఆన్ డ్యూటీ లెటర్ ఇచ్చిన జీహెచ్ఎంసీ కమిషనర్
సమగ్ర సర్వే నేపథ్యంలో అత్యవసర సర్వీసుల్లో పని చేసే వారు సంస్థ నుండి లేఖ ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ చెప్పారు. రేపు డ్యూటీలో ఉంటున్నందున తాను తన కుటుంబ సభ్యులకు ఓ లేఖ ఇచ్చానని చెప్పారు. దానిని ఎన్యూమరేటర్లకు ఇవ్వాలని చెప్పినట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రి సర్వే సజావుగా సాగిందని సోమేష్ కుమార్ చెప్పారు.
హైదరాబాదులో ఇప్పటి వరకు 13.40 లక్షల ఇళ్లలో సమాచారం సేకరించామని, అందులో కేవలం 2,332 ఇళ్లలో ప్రజలు సమాచారం ఇవ్వడానికి సమ్మతించలేదని, అలాగే 21,636 ఇళ్లకు తాళాలు వేసి ఉన్నట్లు చెప్పారు. సర్వే వివరాల కోసం 5,55 ఫోన్ కాల్స్ వచ్చాయన్నారు.
మంగళవారం ఉదయం 7 గంటలకు సర్వే ప్రారంభమవుతుందని, సర్వే కోసం అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంటే చాలు అని ప్రజలకు సూచించారు. ఎన్యూమరేటర్లకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని, డాక్యుమెంట్లు చూపిస్తే సరిపోతుందన్నారు.
కుటుంబ సభ్యుల వివరాలు సామాజిక స్థితిగతులు తెలుసుకునేందుకే సర్వే చేపడుతున్నామన్నారు. సర్వేకు ప్రజలు సహకరించాలని సోమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. బ్యాంకు ఖాతాల వివరాలు వెల్లడించడం ఇష్టం లేకపోతే ఎవరూ ఇవ్వనక్కరలేదని అయితే అన్ని వివరాలూ ఇస్తే ప్రభుత్వ పథకాలు రూపొందించడానికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఆందోళన వద్దు: రేమాండ్ పీటర్
సర్వే పైన రేమాండ్ పీటర్ సోమవారం వివరణ ఇచ్చారు. సర్వే పైన ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే సర్వే చేపట్టామన్నారు. సక్షేమ పథకాల కోసం ఆయా శాఖలు మళ్లీ సర్వే చేస్తాయన్నారు. సర్వేలో ఇచ్చిన సమాచారాన్ని ప్రభుత్వం నిర్ధారించుకుంటుందన్నారు. ఎక్కడ నివాసం ఉంటే అక్కడే నమోదు చేయించుకోవాలన్నారు. సర్వే వివరాలు ప్రభుత్వం వద్ద మాత్రమే ఉంటాయని, దీని వల్ల ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం వాటిల్లదన్నారు.
పోలీసు శాఖ సేవలు: మహేందర్ రెడ్డి
సమగ్ర సర్వేకు పోలీసు శాఖ సేవలను అందిస్తుందని నగర పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాదులో నాలుగు వేలమంది పోలీసులు ఎన్యూమరేటర్లుగా ఉన్నారని, జీహెచ్ఎంసీ కమిషనర్ పర్యవేక్షణలో వారు పని చేస్తారన్నారు. ప్రజలకు మరింత దగ్గరయ్యే విధానం సర్వే ద్వారా తెలుస్తుందని భావిస్తున్నామన్నారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సమగ్ర సర్వే నేపథ్యంలో ఆర్టీసీ ఎన్యూమరేటర్ల కోసం ప్రత్యేకంగా బస్సులు నడపనుంది. ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 10 గంటల వరకు బస్సులు నడుస్తాయి.
ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలకు హైకోర్టులో చుక్కెదురు
గుర్తింపు రద్దయిన తెలంగాణ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలకు ఉమ్మడి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వెబ్ కౌన్సెలింగ్‌కు అనుమతించాలన్న పిటిషన్‌ను తిరస్కరించిన కోర్టు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు తిరస్కరించింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. సరైన విద్యా ప్రమాణాలు పాటించడం లేదంటూ 174 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ కళాశాలలు హైకోర్టును ఆశ్రయించాయి.
రేపు రాత్రికి సింగపూర్‌కు కేసీఆర్
కేసీఆర్ మంగళవారం రాత్రికి సింగపూర్‌కు పయనమవుతున్నారు. ఆయనతో పాటు మంత్రి ఈటెల రాజేందర్, ఇతర అధికారులు కూడా వెళ్తున్నారు. సింగపూర్ ప్రధాని, ఉన్నతాధికారులతో కేసీఆర్ సమావేశమవుతారు. సింగపూర్‌లో ఐఐఎం పూర్వ విద్యార్థుల సదస్సులో పాల్గొంటారు. ఈ నెల 24వ తేదీన తిరిగి వస్తారు.












Click it and Unblock the Notifications