శంషాబాద్ విమానాశ్రయంలో ప్రయాణికులకు రోబో సేవలు!
హైదరాబాద్: విమాన ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు శంషాబాద్ విమానాశ్రయ అధికారులు రోబోటిక్ పరిజ్ఞానాన్ని వినియోగంలో తీసుకొస్తున్నారు. గ్లోబల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ జీఎంఆర్ గ్రూప్ ఇటీవల తన ఇన్నోవేషన్ బిజినెస్ వర్టికల్ జీఎంఆర్ ఇన్నోవెక్స్‌ను రోబోటిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) ప్రారంభించి విస్తరించింది.
విమానాశ్రయంలో అడుగుపెట్టిన క్షణం నుంచి విమానంలో కూర్చునేంత వరకూ వారికి అవసరమైన సేవలను ఈ రోబోలు అందించనున్నాయి. అలాగే విమానాశ్రయాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు రోబోటిక్ పరిజ్ఞానంతో పనిచేసే పరికరాలు, యంత్రాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందుకోసమే జీఎంఆర్ ఇన్నోవెక్స్ ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించింది.

ఈ కేంద్రంలో రోబోలు, యంత్రాలు, పరికరాలు తయారు చేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు స్టార్టప్ సంస్థలను ఆహ్వానిస్తున్నారు. దీంతోపాటు రోబోటిక్ సాంకేతిక పరిజ్ఞానంపై కొత్త ఆవిష్కరణలను పంచుకునేందుకు ఐఐటీ-బాంబే, పెప్పరమెంట్, సైన్ సంస్థలతో విమానాశ్రయ అధికారులు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కొద్ది రోజుల క్రితమే రోబోటిక్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సందర్శించి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రంగా రూపొందించాలని ఆకాంక్షించారు.
ఈ ప్రత్యేక కేంద్రాన్ని జీఎంఆర్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్-సౌత్ ఎయిర్‌పోర్ట్స్ ఎస్జీకే కిషోర్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ... విమానాశ్రయం, ఏవియేషన్ ఎకో-సిస్టమ్ అభివృద్ధి చెందుతున్నందున.. మా రోబోటిక్స్ COE, దాని అత్యాధునిక సాంకేతికత, సమర్థత, భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించే పరిష్కారాలతో పరిశ్రమను మారుస్తుందని వ్యాఖ్యానించారు. అత్యాధునిక పరిష్కారాలను అభివృద్ధి చేసేందుకు ఈ కేంద్రాన్ని ప్రారంభించామని విమానాశ్రయ సీఈవో ప్రదీప్ ఫణికర్ తెలిపారు.












Click it and Unblock the Notifications