బాహుబలి: మేక బలి, థియేటర్లపై ఫ్యాన్స్ దాడులు, గాయాలు
హైదరాబాద్: ప్రభాస్ హీరోగా భారీ తారాగణం, అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కిన తెలుగు సినిమా బాహుబలి శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తెలుగు, తమిళ, మళయాళ, హిందీ బాషల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా బాహుబాలి సినిమా కోసం ఫ్యాన్స్ చేస్తున్న హడావుడికి హద్దు అదుపు లేకుండా పోతుంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఓ మేకను బలి ఇచ్చినట్లు ఓ ఫోటో వాట్సప్‌లో హల్ చల్ చేసింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని సినిమాక్స్ థియేటర్‌లో బాహుబలి మొదటి షోకు ఫ్యాన్స్ మేకను బలిచ్చారని చెబుతున్నారు.
ఇలా ఓ సినిమా కోసం మేకను బలి ఇవ్వడం కలకలం రేపింది. మరోవైపు బాహుబలి చిత్రం ప్రదర్శిమవుతున్న థియేటర్లపై అటు అభిమానులు, ఇటు ప్రేక్షకులు దాడులు చేస్తున్నారు. మొన్నటి మొన్న విశాఖలో బాహుబలి చిత్రం ప్రదర్శించడం లేదంటూ ఓ థియటర్ అద్దాలు పగలగొట్టిన సంగతి తెలిసిందే.
ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి సినిమా మొత్తం 4,000 థియేటర్లలో సినిమా విడుదలైంది. అర్థరాత్రి నుంచే ప్రత్యేక షోలు వేశారు. థియేటర్ల దగ్గర టికెట్ల కోసం వీక్షక్షులు భారీగా క్యూలు కట్టారు. ఎటువంటి దుర్ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.
టికెట్ల దక్కించుకునే క్రమంలో పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తోపులాటలు చోటుచేసుకుంటున్నాయి.
విజయలక్ష్మీ థియేటర్‌పై ప్రేక్షకులు దాడి:
తాజాగా శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఎల్బీ నగర్‌లోని విజయలక్ష్మీ థియేటర్‌పై ప్రేక్షకులు దాడి చేశారు. థియేటర్ యాజమాన్యం టిక్కెట్లను అమ్ముకుంటుందని ఆరోపించిన ప్రేక్షకులు థియేటర్‌పై రాళ్లతో దాడి చేశారు.
ఈ దాడిలో థియేటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. సమీపంలో ఉన్న ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు పురుషులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్ధితిని చక్కదిద్దుతున్నారు.
అభిమానులపై పోలీసుల లాఠీచార్జ్:
అత్తాపూర్‌లోని ఈశ్వర్ థియేటర్ దగ్గర బ్లాకులో టికెట్లు అమ్ముతున్నారని అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఉద్రిక్తత పరిస్ధితులు చోటు చేసుకోవడంతో పోలీసులు అభిమానులపై లాఠీచార్జి చేశారు.
ధియేటర్ వద్ద తోపులాట:
మహబూబాబాద్‌లో బాహుబలి ప్రదర్శిస్తున్న లక్ష్మీకళామందిర్ థియేటర్ వద్ద ప్రేక్షకులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications