పోటెత్తుతున్న గోదావరి: 25 ఏళ్లలో రికార్డ్, రష్యా నుంచి బాబు సమీక్ష

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్/అమరావతి: రానున్న 48 గంటల్లో దేశంలో మరిన్ని వర్షాలు పడనున్నాయి. విస్తారమైన వర్షాలతో రెండేళ్ల వరుస కరవు తీరిపోనుంది. ఈ మేరకు వాతావరణ శాఖ పేర్కొంది. రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

అయితే రాజస్థాన్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాల్సి ఉన్నట్టు జాతీయ వాతావరణ విభాగం చీఫ్ బీపీ యాదవ్ తెలిపారు. వర్షాలపై ఆధారపడే భారత్‌కు ముఖ్యంగా రైతులకు ఇది తీపి కబురని ఆయన పేర్కొన్నారు.

గోదావరి, కృష్ణా పరవళ్లు

గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. గోదావరి ఏపీ, తెలంగాణల్లో ఉద్ధృతంగా ప్రవహిస్తుండగా కృష్ణానదికి కర్ణాటకలో భారీగా వరద వచ్చి చేరుతోంది. గోదావరి ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ధవళేశ్వరం ఆనకట్ట వద్దకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది.

కరీంనగర్ జిల్లా రాయపట్నం వద్ద వరద ఉధృతి బాగా కనిపిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరం వద్ద నీరు 12 అడుగులకు చేరింది. దవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. లంక గ్రామాల్లోకి వరద నీరు వస్తోంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అదికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Godavari river overflows, water level up in dams

అదిలాబాద్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి వేశారు. స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. భద్రాచలంవద్ద గరిష్ఠంగా 49.80 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గోదావరిలో 24 గంటల్లో 30.4 అడుగుల నీరు పెరిగింది. 25 ఏళ్లలో ఇది రికార్డ్.

సోమవారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం ఆనకట్టవద్ద 7.30 అడుగుల నీటిమట్టం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం వద్ద సోమవారం 4 మీటర్ల మేర వరద పెరిగింది.

పోలవరం నుంచి ఏజెన్సీ గ్రామాలకు వెళ్లే కొత్తూరు గ్రామ సమీపంలో ఉన్న తవ్వు కాల్వపైకి వరద నీరు ప్రవహించడంతో సాయంత్రం నుంచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టిసీమలో మహానందీశ్వరస్వామి, శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయాలు చుట్టూ భారీగా గోదావరి నీరు ప్రవహిస్తోంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకంవద్ద నీటిమట్టం 22 మీటర్లకు చేరింది.

రష్యా నుంచి చంద్రబాబు సమీక్ష

గోదావరి నది వరద పరిస్థితిపై ఏపీ సీఎం చంద్రబాబు రష్యా నుంచి సమీక్షించారు. అధికార యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. పట్టిసీమ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గోదావరి వరద ఉద్ధృతిపై ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌, తూగో జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Godavari river overflows, water level up in dams.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి