వేలానికి గోల్కొండ నీలి వజ్రం; దీని చరిత్ర, విలువ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాచరిక వారసత్వ సంపద అయిన గోల్కొండ నీలి వజ్రం వేలానికి రాబోతుంది. ఒకప్పుడు ఇండోర్, బరోడా మహారాజుల వద్ద ఉన్న ఈ వజ్రం మే 14వ తేదీన జెనీవాలో జరిగే క్రిస్టీన్ మ్యాగ్నిఫిసెంట్ జ్యువెల్స్ సేల్ లో వేలానికి రానుంది.
ప్రపంచంలోనే అరుదైన నీలి వజ్రాలలో ఒకటి
రాచరిక వారసత్వంతో పాటు అసాధారణమైన రంగు, పరిమాణంతో ది గోల్కొండ బ్లూ డైమండ్ ప్రపంచంలోనే అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచిందని చెబుతారు. అటువంటి అరుదైన అపురూపమైన వజ్రాన్ని వేలం వేయడానికి సిద్ధం చేసినట్టు క్రిస్టీన్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా చెబుతున్నారు. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న అరుదైన ఈ వజ్రం దాదాపు 300 కోట్ల నుంచి 430 కోట్ల రూపాయల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

259 సంవత్సరాల చరిత్ర ఉన్న వజ్రం
23.24 క్యారెట్ల ఈ అరుదైన వజ్రానికి 259 సంవత్సరాల చరిత్ర ఉందని చెబుతున్నారు. మొదట ఈ నీలి వజ్రం ఇండోర్ రాజవంశం యొక్క గొప్పతనానికి చిహ్నంగా ఉండేదని చెబుతున్నారు. పూర్వం ఇండోర్ ను పాలించిన మహారాజ యశ్వంతరావు హోల్కర్ 2 దగ్గర ఈ వజ్రం ఉండేదని, 1923లో మహారాజా తండ్రి బ్రాస్లెట్ లో పెట్టించారని చెబుతున్నారు.
ఇండోర్ మహారాజుల నుండి బరోడా మహారాజుల వద్దకు
ఆ తర్వాత మళ్లీ ఆభరణాలను రీ డిజైన్ చేసిన సమయంలో ఈ వజ్రాన్ని ఇండోర్ పియర్ వజ్రాలతో చేసిన నెక్లెస్ లో అమర్చారని చెబుతున్నారు. 1947లో న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ దీనిని కొనుగోలు చేశారని, ఆ తర్వాత ఇది బరోడా మహారాజు వద్దకు చేరిందని చెబుతున్నారు. చివరిగా ఒక ప్రైవేట్ సంస్థ ఈ వజ్రాన్ని సొంతం చేసుకుందని సమాచారం.
వేలానికి వచ్చిన అరుదైన వజ్రం
ఎంతో విలువైన అరుదైన ఈ వజ్రం వేలానికి రావడం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ వజ్రానికి సంబంధించి ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ బౌ టెట్ డి మోన్వెల్ ఒకప్పటి ఇండోర్ మహారాణి చిత్రాన్ని గీసి ఆ చిత్రంలో రాణి ధరించిన ఆభరణాలలో ఈ డైమండ్ కూడా ఉన్నట్టు చూపించారు. నాటి రాచరికానికి ప్రతీకగా, వారసత్వ సంపదకు సాక్షిగా నిలిచిన ఈ వజ్రం వేలానికి రావడం విశేషం.
ఈ వజ్రం ఎవరికి దక్కుతుందో
ఇక ఈ వజ్రాన్ని కొనుగోలు చేసేందుకు వివిధ ప్రఖ్యాత సంస్థలు, ప్రముఖులు పోటీ పడతారని భావిస్తున్నారు. అత్యంత విలువైన ఈ వజ్రాన్ని దక్కించుకునే ప్రముఖులు ఎవరో వేచి చూడాల్సిందే. అలాగే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వజ్రం విలువ వేలంపాటలో ఎంత పలుకుతుందో కూడా వేచి చూడాల్సిందే. కాగా ఈ వజ్రం మూలాలు మన గోల్కొండ గనులతో ముడి పడి ఉన్నాయని అంటున్నారు.












Click it and Unblock the Notifications