దసరాకు ముందే శుభవార్త.. ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఈ-గరుడ బస్సులు!
రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రవాణా సదుపాయాలను మెరుగుపరిచేందుకు ఆర్టీసీ ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే. దసరా, దీపావళి పండుగల సమయంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చెయ్యటమే కాకుండా ఈసారి పండుగ కానుకగా దసరాకు ముందే ఈ గరుడ బస్సులను కూడా అందుబాటులోకి తెస్తున్నారు.
విజయవాడకు ఈ గరుడ బస్సులు
ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఒక శుభవార్త చెప్పింది. ప్రయాణికులకు హైదరాబాద్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు రెండు ఈ గరుడ బస్సులను నేడు ప్రారంభించింది. విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడిపించాలని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించిన క్రమంలో మొదటి దశలో రెండు ఈ గరుడ బస్సులను నేటి నుండి ప్రారంభించింది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

ట్రాఫిక్ తిప్పలు లేకుండా తక్కువ సమయంలో విజయవాడకు
పటాన్ చెరువు, బీహెచ్ఈఎల్, రామచంద్రాపురం నుంచి విజయవాడ వెళ్లే ప్రయాణికుల కోసం బీహెచ్ఈఎల్ డిపో నుండి కొత్తగా ఓఆర్ఆర్ మీదుగా రెండు ఈ గరుడ బస్సులను ప్రారంభించింది. తెలంగాణ ఆర్టీసీ రంగారెడ్డి జిల్లా ఆర్ఎం శ్రీలత ఈ బస్సుల ద్వారా విజయవాడకు ట్రాఫిక్ తిప్పలు లేకుండా తక్కువ సమయంలో సులభంగా చేరుకోవచ్చు అని వెల్లడించారు.
రూట్ ఇలా
ఈ - బస్సులు రామచంద్రపురం, బీరంగూడ, చందానగర్, మియాపూర్ నిజాం పేట క్రాస్ రోడ్స్ నుంచి హౌసింగ్ బోర్డ్ మీదుగా జేఎన్టీయూ రైతు బజార్, మలేషియా టౌన్షిప్, శిల్పారామం, సైబర్ టవర్స్, మై హోమ్ భుజ, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాం నగర్ మీదుగా ఓఆర్ఆర్ నుండి విజయవాడకు వెళతాయని పేర్కొన్నారు.
ప్రతీరోజూ రెండు బస్సులు
ఇక ఈ రూట్ లో ప్రయాణం చేయడం ద్వారా విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా త్వరగా గమ్యస్థానానికి చేరుకుంటారని, ప్రతిరోజు రాత్రి 9:30 గంటలకు, రాత్రి పదిన్నర గంటలకు రామచంద్రపురం నుంచి బస్సులు బయలుదేరుతాయని పేర్కొన్నారు. విజయవాడకు ప్రయాణం చేయాలనుకునే ప్రయాణికులు ఈ - బస్సులను వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని చెబుతున్నారు.
ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు!!
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) September 30, 2024
ప్రయాణికులకు సమయాభావం తగ్గించేందుకు #Hyderabad ఓఆర్ఆర్ మీదుగా విజయవాడకు ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని #TGSRTC యాజమాన్యం నిర్ణయించింది. మొదటి దశలో రెండు ఈ-గరుడ బస్సులను సోమవారం నుంచి ప్రారంభించింది. ఈ బ… pic.twitter.com/BmZjiVkRqP
ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్
అయితే ఈ బస్సులలో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడం కోసం టి జి ఎస్ ఆర్ టి సి బస్ అఫీషియల్ వెబ్సైట్ ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనర్ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సుఖవంతమైన సౌకర్యవంతమైన వేగవంతమైన ప్రయాణం కోసం ఆర్టీసీ ఈ గరుడ బస్సులలో ప్రయాణం చేయాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications