సర్పంచ్‌లకు శుభవార్త: ఇక పంచాయతీల సొంత ఖాతాలోనే పంచాయతీ ఆదాయం!
తెలంగాణలోని సర్పంచ్‌లకు, గ్రామ పంచాయతీలకు శుభవార్త చెప్పారు మంత్రి సీతక్క. గ్రామ పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ఇకపై ప్రభుత్వ ఖజానాలో జమ చేయాల్సిన అవసరం లేకుండా చట్ట సవరణ చేశారు. ఆ నిధులను స్థానిక అవసరాలకు నేరుగా వినియోగించుకోవచ్చని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గురువారం శాసనసభలో రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం-2018లోని సెక్షన్ 70 సబ్‌సెక్షన్ 3కు సవరణ బిల్లుకు ఆమోదం లభించింది.
ఈ సవరణతో సర్పంచ్ లు గ్రామ పంచాయతీ నిధులను గ్రామ అవసరాలకు నేరుగా ఉపయోగించుకోవచ్చు. గ్రామసభ తీర్మానం చేస్తే పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, ఇతర స్థానిక అభివృద్ధి పనులకు నిధులు వినియోగించుకోవచ్చు. ఈ నిధుల ఉపయోగం కోసం ట్రెజరీ ఆమోదం తీసుకోవాల్సిన అవసరంలేదు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఆదాయాన్ని ప్రభుత్వ ఖాతాలో వేసి, గ్రామ అవసరాలకు వినియోగించాలి అన్నా ట్రెజరీ ఆమోదం ఉంటేనే వినియోగించేలా చట్టసవరణ చేసింది.

దీంతో గ్రామ సర్పంచ్ లు నిధుల వినియోగం విషయంలో బాగా ఇబ్బంది ఎదుర్కొన్నారు. గ్రామ అవసరాలకు కావాలన్నా గ్రామస్థాయిలో నిర్ణయం తీసుకునే పరిస్థితి లేకుండా ఉండేది. ఆ పరిస్థితిని మార్చిన తెలంగాణా ప్రభుత్వం సర్పంచ్ లకు తాజాగా తీసుకున్న నిర్ణయంతో బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దీనిపై మంత్రి సీతక్క మాట్లాడుతూ, 73వ రాజ్యాంగ సవరణ ప్రకారం స్థానిక సంస్థలకు పన్నులు, సుంకాలు వసూలుచేసి స్థానికంగా ఖర్చుచేసే అధికారం ఉందని గుర్తుచేశారు.
2018లో తీసుకొచ్చిన చట్ట సవరణతో ఈ అధికారానికి గండి పడిందని, ఆదాయాన్ని ప్రభుత్వ ట్రెజరీలో జమ చేసేలా చేశారని విమర్శించారు.మున్సిపాలిటీలకు నిధుల వినియోగ అవకాశం ఇచ్చి పల్లెలపై వివక్ష చూపారని సీతక్క ఆరోపించారు. ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ నిధులు బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లే, పంచాయతీ సొంత ఆదాయం కూడా బ్యాంకుల్లో జమ చేసుకుని వినియోగించుకునేలా సవరణ తెచ్చామని చెప్పారు.
ప్రతినెలా పంచాయతీలకు రూ.50 కోట్లు విడుదల చేస్తున్నామని, 2025-26లో కేంద్రం నుంచి రూ.619 కోట్లు రావాల్సి ఉందని తెలిపారు. మాజీ సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులు, మల్టీపర్పస్ సిబ్బంది వేతనాలు, ఏజెన్సీ ప్రాంతాల్లోని 52 పంచాయతీలకు ప్రత్యేక నిధులు వంటి అంశాలపై కూడా దృష్టి సారిస్తున్నామని మంత్రి వివరించారు. అక్టోబరు తర్వాత గ్రామాల్లో పొలం బాటల నిర్మాణ పనులు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ నిర్ణయం సర్పంచ్‌లకు, గ్రామ పంచాయతీలకు స్వతంత్ర నిర్ణయాధికారం ఇస్తుందన్నారు.













Click it and Unblock the Notifications
